Enumerators Problems in Survey in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు విధి నిర్వహణలో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో సమస్య ఎదురువుతోందని వాపోతున్నారు. సర్వే పూర్తి చేయడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కొన్నేళ్లుగా స్థిరపడిన ఒక కుటుంబం వద్దకు ఓ ఎన్యూమరేటర్ వెళితే తమ ఊరిలో ఇల్లు ఉందని తాము అక్కడే రాయించుకుంటామని చెప్పి పంపించేశారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఉదయం ఆరున్నర గంటలకే గ్రామానికి చేరుకుని 8:30 వరకు, మళ్లీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేస్తున్నారు.
- వర్ధన్నపేటలో ఓ ఇంటికి ఎన్యూమరేటర్ ఎండీ రహీం, సాంబయ్యలు మంగళవారం మధ్యాహ్నం 2:40కు వెళ్లగా సర్వే పూర్తి అయ్యేవరకు దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది. కుటుంబ సభ్యలు భూమి, ఆస్తి, వివరాలు చెప్పడానికి వెనుకాడారు. ఎన్యూమరేటర్ల సంఖ్యను పెంచి ఒక్కొక్కరికి 70 ఇళ్ల చొప్పున కేటాయిస్తే బాగుంటుందని ఎన్యూమరేటర్లు అంటున్నారు.
- వర్ధన్నపేటలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి ఎన్యూమరేటర్ జ్యోత్స్న మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. సర్వే పూర్తయ్యేసరికి గంట సమయం పట్టింది. ఆ ఉద్యోగి అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య వివరాలు చెప్పింది. కానీ మరికొన్ని వివరాలు చెప్పడానికి తటపటాయించారు.
- ఎక్కువగా ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. మరికొంత మంది అన్ని వివరాలు చెప్పడం లేదు. నర్సంపేటలోని 4వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంటికి ఎన్యూమరేటర్ లావణ్య సర్వే చేశారు. తాను మహిళా స్వయం సహాయ సంఘాల్లో ఆర్పీగా పని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందుల ఎదుర్కొలేదని తెలిపారు.
ఇబ్బందులు - పరిష్కారాలు
సంఖ్య పెంచాలి : జనాభా ఆధారంగా ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 175 కుటుంబాలను కేటాయించాలి. కానీ సర్వే చేస్తున్న సమయంలో ఆ సంఖ్య పెరుగుతోంది. ఉదాహరణకు ఒక కుటుంబ వివరాలను ఒక ఫారంలోనే నమోదు చేస్తుంటే పెళ్లిళ్లు అయిన కుమారులు వారి వివరాలను వేరుగా నమోదు చేయించుకుంటున్నారు. ఈ సమస్య ఉన్నచోట్ల ఎన్యూమరేటర్ల సంఖ్య పెంచితే అనుకున్న సమయానికి సర్వే పూర్తవుతుంది.
ఇళ్లకు తాళాలు :సర్వే రోజువారీ లక్ష్యం దిశగా సాగడం లేదు. పల్లెల్లో వరికోత, పత్తి పనులకు కూలీలు, రైతులు ఉదయం 9 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఉదయం పిల్లలకు పాఠాలు చెప్పి, మధ్యాహ్నం ఇళ్లలకు వెళితే ఎవరూ ఉండడం లేదు. వీలు ఉన్నా చోట్ల ఉదయం కూడా అవకాశం కల్పించాలి.
ఆస్తి వివరాలు చెప్పట్లేదు : 75 ప్రశ్నల్లో స్థిరచరాస్తుల వివరాలను అడిగినప్పుడు కొందరు చెప్పడంలేదు. ఆస్తి వివరాలు ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, టీవీ, మొబైల్ ఫోన్లు ఉన్నా లేవంటూ నమోదు చేయించుకుంటున్నారు. అప్పుల సమాచారాన్ని మాత్రం అడిగిన వెంటనే చెప్పేస్తున్నారు.
ఎక్కువ సమయం పడుతుంది :ఒక్కో కుటుంబం వివరాలను నమోదు చేయడానికి దాదాపు చాలా సమయం పడుతుంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట అయితే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కొందరు వివరాలు చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్ణీత గడువు ఈ నెల 18 కాకుండా పొడిగించాలని ఎన్యూమరేటర్ల కోరుకుంటున్నారు.