Encounter at Telangana - Chhattisgarh Border : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. నాలుగు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు- మావోయిస్టుల (Security Forces- Naxalites) మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ముగ్గురు హతమయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట - ఛత్తీస్‌గఢ్‌లోని ఊసూరు బ్లాక్ ఠానా పరిధిలోని పూజారీ కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ దళాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెంట్రల్ రీజియన్ కమాండర్ అన్నె సంతోశ్ అలియాస్ సాగర్‌తో పాటు ఏసీఎం మణిరాం మరో దళసభ్యుడు మృతి చెందారు.
ఘటనా స్థలిలో ఏకే-47తో పాటు 12 బోర్ తుపాకులు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha) దాడులే లక్ష్యంగా మావోయిస్టులు ప్రత్యేకంగా సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను (Dead Bodies) హెలికాప్టర్లో బీజాపూర్‌కు తరలించారు.
5 LaKhs Reward On Anne Santhosh :మావోయిస్టుపార్టీలో క్రమక్రమంగా ఎదిగిన సంతోశ్ భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు ధీటైన వ్యూహరచనలు (Strategic Plans) చేయడం, పకడ్బందీ దాడులు చేయడంలో నేర్పరి. అతనిపై ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు రూ.5 లక్షల రివార్డు (Reward) ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన సంతోశ్, 22 ఏళ్ల క్రితమే అడువుల బాటపట్టాడు. ఛత్తీస్‌గఢ్ అభయారణ్యం జోనల్ కమిటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ బీకేఏఎస్ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదలైంది. ములుగు ఎస్పీ కనుసన్నల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, అందుకు ఎస్పీ పూర్తి బాధ్యత వహించాలని, నెత్తుటి బాకీ తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి :కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపుర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేంద్ర గ్రామ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలు, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.