Haryana Teachers Missing Updates in AP : పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం సరాయివలస ఏకలవ్య పాఠశాలలో వసతిగృహ వార్డెన్‌గా మహేశ్, భౌగోళికశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఆర్తి పని చేస్తున్నారు. హరియాణాకు చెందిన వీరిద్దరూ ఈ ఏడాది జూన్ 20న విధుల్లో చేరారు. సాలూరులో అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. జోరు వానలు కురుస్తున్నా విధులకు హాజరయ్యారు. తిరిగి బైకుపై బయల్దేరారు.
Two Teachers Died in Pachipenta Mandal :మార్గం మధ్యలో రాయిమాను కొండవాగు ఉప్పొంగడం వల్ల అక్కడే నిరీక్షించారు. ఓ ద్విచక్ర వాహనం వాగు దాటిపోవడం వల్ల వీరు కూడా వెళ్లేందుకు యత్నించారు. ప్రమాదవశాత్తు పట్టుతప్పి వాగులో పడిపోయారు. వార్డెన్ మహేశ్ ఓ చెట్టు కొమ్మ సాయంతో ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు. కానీ అది విరిగి పోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికుల గాలించి ఆర్తి, మహేశ్ మృతదేహాలను వెలికితీశారు.
ఇద్దరు సిబ్బంది ప్రాణాలు వాగులో కలవడానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2020లోనే కొటికిపెంటకు ఏకలవ్య పాఠశాల మంజూరైంది. జనవరిలో భూమి పూజ చేశారు. నాలుగేళ్లయినా పనులు పూర్తి చేయకపోవడం వల్ల పక్కనున్న సరాయివలస ఆశ్రమ పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ వసతి లేదు. ఫలితంగా సాలూరు, గురివినాయుడుపేట, పాంచాలి ప్రాంతాల్లో ఉంటూ ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తుంటారు.
రాయిమాను వాగు దాటాల్సిందే :దీంతో నిత్యం రాయిమాను వాగు దాటాల్సిందే. కొటికిపెంట పాఠశాల సకాలంలో కట్టి ఉంటే ఆర్తి, మహేశ్ ప్రాణాలు కోల్పోయే వారు కాదని స్థానికులు అంటున్నారు. మరోవైపు రాయిమాను కొండవాగుపై దశాబ్దాల క్రితం నిర్మించిన కాజ్ వే శిథిలావస్థకు చేరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. సరాయివలస, శివలింగాపురం, బయలుగుడ్డి, కొత్తవలస వెళ్లేందుకు వంతెనలు నిర్మించాలని వేడుకున్నా సమస్య తీరలేదని స్థానికులు ఆక్రోశిస్తున్నారు.