Employed Couple Rs.30 Lakh Fraud In Vinnakota Sub Post Office : ఏలూరు జిల్లా విన్నకోట సబ్ పోస్టాఫీసులో భారీ స్థాయిలో గోల్‌మాల్ జరిగింది. దంపతులైన ఉద్యోగులిద్దరూ ఖాతాదారుల సొమ్ము దాదాపు రూ.30 లక్షల్ని ప్రభుత్వానికి జమ చేయకుండా సొంతానికి వాడేసుకున్నారు. పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై గుట్టుచప్పుడు కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పక్కదారి పట్టిన సొమ్ముని భార్యాభర్తల నుంచి రికవరీకి ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా ముదినేపల్లి పోస్టాఫీసు పరిధిలో ఉండే విన్నకోట సబ్‌పోస్టాఫీసు పరిధిలో విన్నకోట, కట్టవానిచెర్వు, పురిటిపాడు, చినగొన్నూరు గ్రామాలున్నాయి. ఈ బ్రాంచిలో డోకిపర్రుకు చెందిన కాగిత వరుణ్మయి ఏబీపీఎం(ABPM)గా పని చేస్తున్నారు. బీపీఎం(BPM) ఉద్యోగ విరమణ వరకూ ఆమే బీపీఎంగా విధులు నిర్వహించేది. ఈ క్రమంలో ఆమెకు ఈడే రాజాతో వివాహం కాగా నిరుద్యోగి అయిన తన భర్తకు బీపీఎంగా అవకాశం ఇవ్వాలని కోరడంతో డిపార్ట్‌మెంట్ అధికారులు ఆమేరకు అంగీకరించి బీపీఎంగా ఉద్యోగం కల్పించారు. 2023 డిసెంబరు నుంచి అతడు బీపీఎంగా విధుల్లో చేరాడు. కార్యాలయంలో ఉన్న రెండు ఉద్యోగాలను భార్యాభర్తలిద్దరూ నిర్వహిస్తున్నారు.
నెలనెలా వడ్డీ రూపంలో రాబడి కావాలా? ఈ టాప్-3 స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి! - Investment Plan For Monthly Income
ఈ క్రమంలో ఖాతాదారులు, గ్రామస్థులు తమ పట్ల పెంచుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు అనుకూలంగా మార్చుకున్నారు. ఖాతాదారులు తమ ఎస్‌బీ, ఆర్‌డీ, ఎస్‌ఎస్‌ఏ తదితర ఖాతాల్లో జమ చేయాలని ఇచ్చిన డబ్బును ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా పుస్తకాల్లో మాత్రం నమోదు చేసి ఇచ్చేవారు. నిరక్షరాస్యులైన వారికి పుస్తకాల్లో కూడా నమోదు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఇలా దాదాపు 10 నెలల కాలంలో పోస్టాఫీసు ఖాతాదారుల ఖాతాల ద్వారా ప్రభుత్వానికి చేరాల్సిన మొత్తం రూ. 30 లక్షలు వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఈ బ్రాంచి నుంచి అనేక ఖాతాల్లోని నగదు ఆగిపోవడంతో అధికారులు, కొందరు ఖాతాదారుల్లోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు విచారణ ప్రారంభించి సొమ్ము గోల్‌మాల్ అయినట్లు గుర్తించారు. దీంతో వారిని పక్కన పెట్టి రహస్యంగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
రికవరీకి అధికారుల ఆపసోపాలు : ఖాతాదారుల పుస్తకాలను స్వయంగా పరిశీలించి వారి అకౌంట్ల వివరాలు, రికార్డులను సరిచూస్తే నగదు వ్యత్యాసం భారీగా కనిపించింది. దీంతో వారి నుంచి రికవరీకి చర్యలు చేపట్టారు. ఐతే ఖాతాదారుల పుస్తకాల్లో నమోదు చేసి ముద్ర వేసి ఇచ్చిన వారికి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఎలాగైనా ఆ కాలంలోని ప్రతి ఉద్యోగి(ఇన్‌స్పెక్టర్ నుంచి పైస్థాయి అధికారి వరకూ అందరూ) బాధ్యులే కాబట్టి వారి జీతాల నుంచి వీటిని మినహాయించి ఖాతాదారులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పుస్తకాల్లో నమోదు చేయని ఖాతాదారులు మాత్రం నష్టపోతారు. వారికి శాఖాపరంగా ఎలాంటి హామీ లభించదనే అభిప్రాయంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.
దీనిపై గుడివాడ సర్కిల్ అసిస్టెంట్‌పోస్టల్ సూపరింటెండెంట్ వెంకట్రావ్‌ను సోమవారం ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, విన్నకోట సబ్‌పోస్టాఫీసులో గోల్‌మాల్ జరిగినట్లు నెలకిందటే గుర్తించి సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామని, ప్రతి ఖాతాదారుడి ఖాతాలు, పుస్తకాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. ఖాతాదారుల నుంచి తీసుకున్న నగదు డిపార్ట్‌మెంట్‌కు జమ చేయలేదని, వారి నుంచి రికవరీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఖాతాదారురాలి సొమ్ము కొట్టేసిన పోస్ట్‌మాస్టర్ - బాధితురాలి ఆవేదన - Postmaster Fraud in Satya Sai Dist
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - రోజూ రూ.95 పెట్టుబడితో రూ.14 లక్షలు మీ సొంతం! - Ggram sumangal yojana scheme