Emotional Scenes During Chandrababu Swearing Ceremony: చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆత్మీయుల ప్రమాణస్వీకారంతో కుటుంబసభ్యుల ఆనందాన్నికి అవధుల్లేవు. ఇవాళ జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎన్నో అపూర్వ ఘట్టాలు తారసపడ్డాయి. ఆ మధుర క్షణాలు మీరు చూసేయండి. చంద్రబాబు పట్టాభిషేకంలో ఎన్నో ఆనంద క్షణాలు దర్శనమిచ్చాయి.
'చంద్రబాబు అనే నేను' అనగానే ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండగా నందమూరి రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. చంద్రబాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారంతో పవన్ ఫ్యాన్స్‌కు, జనసైనికులకు పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. జనసేనాని ప్రమాణం చేస్తుండగా జనసేన నేతలు, అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు. పవన్‌ను చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి 'అన్నా లెజ్నోవా' వీడియో తీస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని చిరు ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణానికి కుటుంబ సభ్యులంతా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ప్రత్యేక వాహనాల్లో సభా వేదిక వద్దకు రాగా నాగబాబు, సాయిధర్మతేజ్, అకీరాతో సహా ఇతరులు బస్సులో వచ్చారు.