Electrical Wires Cut at Railway Station:విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయనే ప్రచారంపై రైల్వే అధికారులు స్పందించారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో విద్యుత్ తీగల ఘటనపై రైల్వే అధికారుల వివరణ ఇచ్చారు. రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే స్పష్టం చేసింది. నిర్వహణలో భాగంగా మూడో ప్లాట్‌ఫారంపై విద్యుత్ తీగలు మారుస్తున్నారని అధికారులు తెలిపారు. స్టేషన్‌లో ఓవర్‌హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని అధికారులు అన్నారు. రైళ్ల రాకపోకలు యధావిధిగా నడుస్తున్నాయని తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది.
ఇంతకీ ఆ వార్తలో ఏం ఉందంటే:కాగా అంతకుముందు విశాఖ రైల్వే స్టేషన్‌లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయని వార్తలు వచ్చాయి. రైలు ఇంజిన్ కొంతదూరం ఈడ్చుకెళ్లిందంటూ వైరల్ అయ్యాయి. తమిళనాడులోని తిరునల్వేలి నుంచి పశ్చిమ్‌బెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు ఉదయం 5.20 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చిందని, ఇక్కడ రైలు ఇంజిన్ మార్చారని, ఇంజిన్ ముందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని ఓ వార్త చక్కర్లు కొట్టింది. సిబ్బంది వెంటనే విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని ఆ వార్తలో ఉంది.