Polling in Rayalaseema:ఐదేళ్లపాటు అడ్డూ అదుపు లేకుండా అరాచకం సాగించిన వైసీపీ, చివరికి పోలింగ్‌రోజూ అదే విధ్వంసకాండ కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో, హింసకు దిగింది. దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై, దాడులు, కిడ్నాప్‌లతో ఓటర్లను భయాందోళనకు గురిచేసింది. రాళ్లు రువ్వడం వాహనాలు ధ్వంసం చేస్తూ రక్తపాతం సృష్టించింది.
చిత్తూరు జిల్లాలో నియంతృత్వం సాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు పోలింగ్ రోజు అడ్డేలేకుండా పోయింది. ఆయన సొంతమండలం సదుంలోని, బూరగమంద పోలింగ్‌కేంద్రంలో తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉండేందుకు వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. మూడు కార్లలో ఎక్కించుకుని, దుగ్గంవారిపల్లెలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి బెదిరించారు. తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉంటే, మెడకాయలపై తలకాయలు ఉండవంటూ హెచ్చరించి వారి ఫోన్లు లాక్కున్నారు. ఈ వ్యవహంరం, కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వారిని వదిలేశారు.
అన్నమయ్య జిల్లా పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్ సుభాష్‌రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, చెర్లోపల్లె దగ్గర వాహనం నుంచి కిందకు తోసేశారు. మరో ఏజెంట్‌ను రాత్రి వరకు వదిలిపెట్టలేదు. దళవాయిపల్లెలో, జనసేన ఏజెంట్ రాజారెడ్డిపై దాడి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా చిన్నగులవలూరు పోలింగ్ కేంద్రంలోకి దౌర్జ్యంగా వెళ్లిన మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి, తెలుగుదేశం ఏజెంట్ ఉగ్రనరసింహులుపై దాడి చేశారు. అనంతపురం జిల్లాతాడిపత్రి పట్టణంలో టీడీపీ ఏజెంట్లపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు. పాణ్యం నియోజకవర్గం బీసీ కాలనీలో టీడీపీ ఏజెంట్ వెంకటేశ్‌పై, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి చేయిచేసుకున్నారు.
ఉరవకొండలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి హల్‌చల్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్దే కూర్చుని, ముస్లిం ఓటర్లను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించడంతోపాటు, అడ్డుకోవడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సొంత గ్రామమైన నల్లసింగయ్యగారిపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిరెడ్డిపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని బెస్తరపల్లిలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు అల్లుడు దేవినేని ధర్మతేజపై వైసీపీ మూకలు రాళ్లు విసిరారు. ఆయన కారు అద్దం ధ్వసం చేశారు.