Election Campaign has Gaining Momentum Across the State: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటింటికీ వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలతో ఆ పార్టీల్లో జోష్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎన్డీయే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. ఈశ్వరరావును ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామి శ్రీనివాసనంద సరస్వతి ప్రజలను కోరారు.
రాష్ట్రాభివృద్ధి కోసం బాబును గెలిపిద్దాం- జోరుగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
పార్వతీపురం జిల్లా పాచిపెంటలో సాలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణికి కూటమి నాయకులు పూర్తి మద్దతు తెలియజేశారు. రాజాం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నిక ప్రచారంలో భాగంగా జయహో బీసీ సదస్సు నిర్వహించారు. అనంతరం బొద్ద గ్రామంలో ప్రచారం నిర్వహించగా ఆయన సమక్షంలో 20 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీలో చేరాయి.
గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం చేశారు. మేడికొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాపట్ల జిల్లా పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ వలపర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. చీరాల మండలం దేవినూతలకు చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల టీడీపీ అభ్యర్థి ఎం.ఎం కొండయ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.