తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ 8 అలవాట్లు మీకుంటే - అనారోగ్యం మీ దరిచేరదంతే! - వైద్య నిపుణులు చెబుతున్న నియమాలివే

ఆరోగ్యంగా ఉండేందుకు 8 అలవాట్లు - జీవితంలో మీ దరికి చేరని ఆరోగ్య సమస్యలు -

Eight Habits in Telugu Which Can Prevent Health Problems
Eight Habits in Telugu Which Can Prevent Health Problems (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Eight Habits in Telugu Which Can Prevent Health Problems : ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో 8 నియమాలను పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్య నిపుణలు అంటున్నారు. సమతుల ఆహారం, పుష్కలంగా నీరు తాగడం, తగినంత నిద్ర, శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత, శుభ్రత అలవాట్లు, మద్యం, ధూమపానం నివారణ, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం. ఈ 8 నియమాల ద్వారా ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చని చెబుతున్నారు. ఖమ్మంలో ‘ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌ - సుఖీభవ’ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేపట్టారు. వైద్య నిపుణులు డా.బి.ప్రియాంక, డా.మేదరమెట్ల అనిల్‌కుమార్, డా.ఆళనే ప్రవీణ్‌కుమార్, డా.ఎం.సుమంత్, సాధారణ, వైరల్‌ జబ్బుల వ్యాప్తి, నివారణ, ఎముకలు, కీళ్ల వ్యాధులు, స్త్రీలలో క్యాన్సర్లు, గుండె జబ్బుల నివారణ గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.

అందరికి గుండె జబ్బులే : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ ఆళనే ప్రవీణ్‌ కుమార్ అన్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడని తెలిపారు. 40 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలన్నారు. హృద్రోగ సమస్యల బారిన పడే అవకాశాన్ని 10-30 ఏళ్ల ముందుగానే గుర్తించే సాంకేతిక సాధనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, పొగ తాగడం, ఎక్కువ సేపు కూర్చొని పనులు చేయడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడితో కూడిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు 50 శాతం గుండె జబ్బులకు కారణమవుతున్నాయని వివరించారు. కొలెస్ట్రాల్‌ పెరుగుదలను నియంత్రించుకుంటే చాలా వ్యాధుల బారినుంచి తప్పించుకోవచ్చని సూచించారు. రోజుకు ఓ వ్యక్తి కనీసం 8 వేల అడుగులు నడిస్తే, 80 శాతం వరకు గుండె వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.

డాక్టర్ ఆళనే ప్రవీణ్‌ కుమార్, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ (ETV Bharat)

గర్భిణులకు వాటిని చూస్తేనే వికారం - అప్పుడు ఇలా తీసుకోవాలట!

అందుబాటులో ఆధునిక చికిత్సలు : ఇటీవల కాలంలో చిన్న వయస్సు నుంచే ఎముకల జబ్బులతో బాధపడుతున్నారని, అందులో ఎక్కువగా మోకాళ్ల నొప్పుల బాధితులే ఉంటున్నారని డాక్టర్‌ మేదరమెట్ల అనిల్‌ కుమార్ తెలిపారు. కీళ్ల నొప్పుల బాధితుల్లో ఎక్కువగా ఊబకాయస్థులే ఉంటున్నారని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిరోజు 30 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచించారు. సైక్లింగ్, స్విమ్మింగ్‌ సాధనతో కీళ్ల నొప్పులను నివారించవచ్చని చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా కాల్షియం స్థాయిలను పరీక్షించుకోవాలని, కీళ్లనొప్పుల బాధితుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. తాత్కాలిక ఉపశమనానికి ఇంజెక్షన్లు, మాత్రలు వాడొద్దని, మోకీళ్ల అరుగుదల సమస్య 1, 2 దశల్లో ఉంటే ప్లాస్మాథెరపీతో, 3, 4 దశల్లో అయితే శస్త్ర చికిత్సతో పరిష్కరించవచ్చని తెలిపారు. కీళ్ల సమస్యలకు మేలైన రీప్లేస్‌మెంట్‌ విధానం ఉందని వివరించారు.

డాక్టర్‌ మేదరమెట్ల అనిల్‌ కుమార్ (ETV Bharat)

మహిళలకు అవగాహన అవసరం :ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా సీజనల్ వైరల్‌ జ్వరాలు పెరిగిపోతాయని డాక్టర్‌ ప్రియాంక అన్నారు. పోషకాహారం, విటమిన్‌ సి, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ కారక జబ్బులను అరికట్టవచ్చని తెలిపారు. మహిళల్లో థైరాయిడ్, క్యాన్సర్లపై అవగాహన అవసరమన్న ఆమె, ‘హైపో థైరాయిడ్‌’తో జీవక్రియ మందగిస్తుందని అన్నారు. హెచ్‌పీవీ వైరస్‌తో సోకే గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదకరమని చెప్పారు. హార్మోన్ల అసమతౌల్యం, మెటబాలిక్‌ సిండ్రోమ్, అధిక బరువు, జెనెటిక్‌ కారణాలు, గర్భనిరోధక మందుల అతి వాడకం, విటమిన్లు, పోషకాల లోపమూ క్యాన్సర్‌కు దారి తీస్తుందని వివరించారు. వ్యాక్సినేషన్‌తో వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు. 9-14 ఏళ్లవారికి రెండు డోసులు, 26 ఏళ్లు దాటితే మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. అమ్మాయిలు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించాలన్నారు.

డాక్టర్‌ ప్రియాంక (ETV Bharat)

ముంపు బాధితులారా బీ అలర్ట్ - సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! - SEASONAL DISEASES PRECAUTIONS

రక్తం క్వాలిటీని జుట్టు చెప్పగలదా? నిపుణులు ఏమంటున్నారు? - Hair Health Tips

ABOUT THE AUTHOR

...view details