Eenadu Offices Ready for Golden Jubilee Celebrations:ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ కార్యాలయాలు స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనిట్ కార్యాలయాలు విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులీనాయి.
50 వసంతాలు పూర్తి పూర్తి చేసుకున్నఈనాడు : అక్షరయోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరగొని అగ్రస్థానానికి చేరుకుంది. నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు, కథనాలను అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనిట్ కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతులతో కొత్త రూపుని సంతరించుకున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు ప్రధాన కార్యాలయం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.
తెలుగు ప్రజల్లో పౌరుషాగ్ని రగిల్చి - ప్రజా ఉద్యమానికి అగ్ని బావుటా అయ్యింది "ఈనాడు" - Eenadu Golden Jubilee Celebrations
ప్రత్యేక ఆకర్షణగా ఈనాడు కార్యాలయాలు :కచ్చితత్వం, ప్రజాప్రయోజనం, విశ్వసనీయత, వృత్తి నిబంధన, సత్యనిష్ఠ ఈ ఐదు సూత్రాలను గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది. ఈనాడు పత్రికను ప్రజలకు మరింత చేరువ చేయడంలో యూనిట్ కార్యాలయాలు కీలక భూమిక పోషించాయి. నేడు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమయ్యాయి. విజయవాడ, విశాఖ, తిరుపతితో పాటు గుంటూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం ఒంగోలులోని ఈనాడు కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ఈనాడు కార్యాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
దీపాల ధగధగలతో ఈనాడు కార్యాలయాలు :స్వర్ణోత్సవ వేళ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఈనాడు కార్యాలయం దీపాల ధగధగలతో మెరిసిపోయింది. ఉప్పల్‌లోని ఈనాడు కార్యాలయం రంగు రంగుల విద్యుత్ దీపాలతో కొత్త రూపు సంతరించుకుంది. కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations