EENADU 50 Years Celebrations : 1974 ఆగస్టు 10. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని ఓ మూతపడిన షెడ్డు. అందులో నుంచి అచ్చుగుద్దుతున్న శబ్ధం! ఆ క్షణంలో అక్కడేం జరుగుతోందో చుట్టుపక్కల వాళ్లకు అర్థం కాలేదు. ఆ తర్వాత అదే తెలుగునాట సమాచార విప్లవానికి నాంది పలికిన 'ఈనాడు' పుట్టింటి చిరునామా అయ్యింది. చీకటి తెరలు చీల్చుతూ, రేపటి ఉదయాన్ని పాఠకులకు చూపింది ఈనాడు. ప్రాంతీయ పత్రికగా అలా మొదలైన ప్రస్థానం, అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు పత్రికగా శిఖరాగ్రాన్ని అధిష్ఠించి, సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది ఈనాడు.
50 ఏళ్ల యంగ్ ఈనాడులో 35 ఏళ్లు నేనూ ఒక పాత్ర పోషించడం, సంస్థలో బాధ్యతాయుతంగా పని చేయడం గర్వకారణం. సంస్థలో చేరినప్పుడు సంస్థ క్రమశిక్షణ, ఛైర్మన్ గారి క్రమశిక్షణ పుణికి పుచ్చుకోవడం వల్ల ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంస్థలో ఉన్నవారితో పాటు నాకూ అదే క్రమశిక్షణ. దానివల్లే ఈ ప్రయాణం కొనసాగుతోంది. - సీహెచ్ కిరణ్, ఈనాడు ఎండీ
50 ఏళ్ల క్రితం తెలుగుజాతి కీర్తిపతాకగా ఈనాడును ఎగురవేసింది అక్షర రుషి రామోజీరావు. నిజానికి ఆయనకు పత్రిక పెట్టాలనే ఆలోచనే లేదు. కాకతాళీయంగా అనుకోని ఓ ప్రయాణం, అందులోని ఓ పరిణామం, 'ఈనాడు' దిన పత్రిక ఆవిర్భావానికి నాంది పలికింది. ఒకరోజు రామోజీరావు విమానంలో ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా పక్క సీటులో నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కేఎల్‌ఎన్ ప్రసాద్ ఉన్నారు. వారితో రామోజీరావు మాటలు కలిపారు. వ్యాపార పనుల నిమిత్తం తాను తరచూ విశాఖ వెళ్తుంటానని, అక్కడికి మీ పత్రిక మధ్యాహ్నం వరకు రావట్లేదని వారి దృష్టికి తెచ్చారు. విశాఖలోనే ఎడిషన్ మీరు ఎందుకు ప్రారంభించకూడదని కేఎల్‌ఎన్‌కు సూచన చేశారు. పేపర్ పెట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదంటూ కేఎల్‌ఎన్ ఇచ్చిన సమాధానం రామోజీరావును నొప్పించింది. అందుకు కారణమూ లేకపోలేదు.
తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడటం ఏంటి? రామోజీరావుకు పరిచయస్థులైన టి.రామచంద్రరావు ఎడ్వర్ టైజింగ్ రంగంలో పని చేసేవారు. ఆయన్ని చూసి రామోజీరావుకు ఎడ్వర్ టైజింగ్ రంగానికి సంబంధించిన మెళకువలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. చదువు పూర్తయ్యాక దిల్లీలోని ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. మూడేళ్లు అక్కడ పనిచేశాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఆ రోజుల్లో తెలుగునాట గోయంకాలకు చెందిన ఆంధ్రప్రభదే అత్యధిక సర్క్యులేషన్. తెలుగు వారు స్థాపించిన పత్రికలు తర్వాతి స్థానాల్లో ఉండేవి. తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడటం ఏంటి? అని ప్రశ్నించుకున్నారు రామోజీరావు. ఆ కారణంతోనే కేఎల్‌ఎన్ ప్రసాద్‌కు సూచన చేశారు. కానీ కేఎల్‌ఎన్ అసాధ్యం అనడంతో రామోజీరావులో పట్టుదల పెరిగింది. అసాధ్యాన్ని ఎందుకు సుసాధ్యం చేయలేం? అనే ఆలోచన రేకెత్తింది.
అందరిలో ఒకడిలా కాకుండా : పత్రిక పెట్టడమైతే ఫిక్స్. మరి ఎక్కడ పెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అప్పట్లో తెలుగు వార్తా పత్రికలన్నీ విజయవాడలోనే అచ్చయ్యేవి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. విశాఖకు పత్రిక రావాలంటే, విజయవాడ నుంచి వచ్చే రైలే దిక్కు. రైలులో పత్రికలు వచ్చి, పాఠకులకు చేరేలోపే ఏ మధ్యాహ్నమో అయ్యేది. ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు సాయంత్రానికి చేరినా గొప్పే. తానూ విజయవాడలో పత్రిక పెడితే అందరిలో ఒకణ్ని అవుతాను, మిగతా పత్రికలకు పోటీదారు అవుతానే తప్ప ప్రత్యేకత ఏముంటుంది? అదే మధ్యాహ్నం వరకు పత్రిక మొహం చూడలేని ఉత్తరాంధ్రలో అయితే తానే మొదటివాడిని అవుతా అనుకున్నారు రామోజీరావు. అసలు పత్రిక ప్రింటింగే లేని విశాఖలోనే మొదటి అడుగు వేయాలని నిశ్చయించుకున్నారు. చైనా యుద్ధతంత్రమైన 'నో మ్యాన్ ల్యాండ్ థియరీ' కూడా అందుకు ప్రేరణ అని చెప్పేవారు రామోజీరావు.
ఆ పదం లేకుండా పేపర్ పేరు : విశాఖలో పత్రిక పెట్టడం సాహసోపేతమైతే, దానికి ఎంచుకున్న పేరు సంచలనం. అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర జనత, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ఇలా 'ఆంధ్ర' పదంతో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర పదం లేకుండా ఓ పేపర్ పేరు పెట్టడం సాహసోపేతమే. ఒకరిని అనుకరించడం అలవాటు లేని రామోజీరావు, అలాంటి సాహసమే చేశారు. పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు. 'నాడు' అంటే 'ప్రాంతము, రోజు' అని రెండర్థాలు ఉన్నాయి. ఈనాడు అంటే ఈ ప్రాంతం అనైనా అనుకోవచ్చు, ఈ రోజు అనైనా అనుకోవచ్చు.
మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే : అలా పేరుతోనే ప్రాంతీయ అనుబంధం పరుచుకుంది 'ఈనాడు'. ఈనాడు పేరే కాదు, మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే. మిగతా పత్రికల పేర్లన్నీ గుండ్రటి అక్షరాలతో ఉంటే, వాటికి భిన్నంగా ఉండాలనుకున్నారు రామోజీరావు. తాను స్థాపించిన కిరణ్ యాడ్స్‌లో పని చేసే నార్లకంటి స్వామి అనే ఆర్టిస్ట్‌కు మాస్ట్ హెడ్ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. నార్లకంటి స్వామి పలకల్లాంటి అక్షరాలతో ఈనాడు లోగో డిజైన్ చేయగా, అక్షరాల మధ్య గీతలు పెట్టించి తుది ముద్ర ఖరారు చేశారు రామోజీరావు. ఆ ముద్రే తెలుగు పాఠకుడి గుండెల్లో చెరగని ముద్రైంది.