BRS MLA Gudem Mahipal Reddy bank locker :మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. కేసులో భాగంగా వీరిద్దరినీ పలుమార్లు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పటాన్‌చెరులోని యాక్సిస్ బ్యాంక్‌లో ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచింది. అందులో భారీ మొత్తంలో బంగారం, రియల్ ఎస్టేట్ పేపర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరుతో రిజిస్టరైన సుమారు రూ.కోటి విలువైన 1.2 కిలోల బంగారు బిస్కెట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 100కు పైగా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుమారుడు విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు బినామీల పేర్లపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా నిందితులు సుమారు రూ.300 కోట్లు సంపాదించినట్టు ఈడీ పేర్కొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే - ఆయన బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - ED Raids MLA Mahipal Reddy house