CID inquiry against Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేశారని తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేసింది. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా IVRS ఐవీఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తునకు ఈసీ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ఈసీ పేర్కొంది.
సోషల్ మీడియాలో చంద్రబాబు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం చేసిన ఫిర్యాదు పై ఎన్నికల సంఘం స్పందించింది. సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణం అని ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేసిందని తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. కుట్రతో, విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ ను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డిజి కి ఆదేశాలు జారీ చేసింది.