ఫలితాలు వచ్చే వేళయింది - అరగంటకో రౌండ్ రిజల్ట్ (ETV Bharat) EC Arrangements for Vote Counting In AP:ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే సాగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్‌లో వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అరగంటలో ముగియనుంది.
ఒకవేళ అరగంట కన్నా ఎక్కువ సమయం పడితే వీటిని లెక్కిస్తూనే ఖచ్చితంగా ఉదయం ఎనిమిదిన్నరకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కిపు మొదలుపెట్టనున్నారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. ఉదయం 10 నుంచి 11 గంటల కల్లా ఫలితాలపై కొంత స్పష్టత రానుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల కల్లా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలకానున్నాయి.
మొదటి దశ :మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగనుంది. మొదటి దశలో ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటల కల్లా లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5గంటలకు అధికారులు వారికి తెలియజేస్తారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా మూడు దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.
ఏపీలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు - తొలి ఫలితం ఆ నియోజకవర్గం నుంచే! - AP ELECTION RESULTS 2024
రెండో దశ :రెండో దశలో తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్ఠంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
మూడో దశ :మూడో దశలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు సాగుతుంది. ఇందుకోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల సీరియల్ నంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు తొలిరౌండ్‌లో 1 నుంచి 14 పోలింగ్ బూత్‌ల ఈవీఎంల్లో ఉన్న ఓట్లు లెక్కించనుండగా రెండో రౌండ్‌లో 15 నుంచి 29 బూత్‌ల ఓట్లు లెక్కింపు చేపడతారు. ఈ విధంగా ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు లెక్కిస్తారు.
ఎక్కడైనా పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా A, B, C వంటి నెంబర్లు ఉంటే వాటినీ విడిగా ఒక పోలింగ్ కేంద్రంగానే పరిగణించి కౌంటింగ్ టేబుల్ కేటాయిస్తారు. అనివార్య కారణాలతో ఈవీఎంల్లో బ్యాటరీ పని చేయకపోయినా, మొరాయించినా ఆ పోలింగ్ కేంద్రాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత సీరియల్ నెంబర్ ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. చివరిలో మొరాయించిన ఈవీఎంలకు సంబధించిన వీవీ ప్యాట్ చీటిలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
నాలుగో దశ :చివరి దశలో ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్ లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది. నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల సంఖ్యలను చిట్టీలు రాసి లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు. లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తారు. ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్‌తో ఒక బూత్‌ను ఏర్పాటుచేసి అక్కడే లెక్కిస్తారు.
ఈవీఎంల్లో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసమొస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఈ వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు.
ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్‌గా ఉండాలంటూ ఆదేశాలు
ఈవీఎం ఓట్ల కౌంటింగ్ అంత ఈజీ కాదు - కౌంటింగ్ ఏజెంట్లు ఏం చేయాలంటే? - EVM VOTES COUNTING