EC Appointed New Collectors and SPs in AP :అధికార పార్టీ వైసీపీతో అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన మొత్తం 9 మంది అధికారుల ప్యానల్ నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్ గా వి. వినోద్ కుమార్ ను ,తిరుపతి కలెక్టగా ప్రవీణ్ కుమార్ లను నియమించారు. ఇక గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ణ త్రిపాఠిని, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ ను నియమించారు. పలనాడు ఎస్పీగా బిందుమాధవ్ గైకిపాటి, చిత్తూరు ఎస్పీగా వీఎన్ మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ లను నియమించారు. పోస్టింగ్ వచ్చిన అధికారులంతా ఈరోజు రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి : గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ట త్రిపాఠి విధులు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు ఐజీ పాలరాజుపై వేటు వేయగా ఆయన స్థానంలో నూతన ఐజీగా సర్వశ్రేష్ణ త్రిపాఠికి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీ తుషార్ డూడి, ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ హనుమంతు, పలువురు జిల్లా అధికారులు ఐజీని గౌరవ పూర్వకంగా కలిశారు.