పక్కదారి పట్టిన సూసైడ్ నోట్ - చెడు అలవాట్ల వల్లే అప్పులని పోలీసుల వక్రభాష్యం DSP Shariff on Subbarao Family Suicide in Kadapa :వైయస్‌ఆర్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల భూ దాహానికి బలైన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు వ్యక్తిగత అంశాలే కారణమని పోలీసులు తేల్చేశారు. వారికి భూమి సంబంధిత సమస్య లేనే లేదని క్రికెట్ బెట్టింగ్, చెడు అలవాట్ల వల్లే అప్పుల పాలయ్యారని వక్రభాష్యం చెప్పారు. భూమిని వేరేవారి పేరుతో మార్చేశారని, ఆ భూమిని అమ్ముకోలేకపోవడం వల్లే తాము చనిపోతున్నామని వారు సూసైడ్ నోట్‌లోని అంశాలనూ పక్కదారి పట్టించారు. మొత్తంగా వైఎస్సార్సీపీ నేతలను కాపాడుతూ చనిపోయిన ఆ చేనేత కుటుంబంపైనే నెపాన్ని నెట్టేశారు.
జగన్ రెడ్డి భూదాహానికి బీసీ కుటుంబం బలి- ఇంకోసారి సీఎం అయితే ప్రజలు బతికే పరిస్థితి లేదు: టీడీపీ - Family Suicide in Ysr District
వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కడప డీఎస్పీ షరీఫ్ మరోసారి ఆ పార్టీకి నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. అధికార పార్టీ అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ వైఎస్సార్సీపీ నాయకుల భూదాహం వల్ల బలవన్మరణానికి పాల్పడగా డీఎస్పీ షరీఫ్ ఆ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. కేసు విషయంపై కడపలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తండ్రి పేరిట ఉన్న భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరిట మార్చేసి దాన్ని తాము అమ్ముకోవడానికి వీల్లేకుండా చేశారని, తహసీల్దారు లంచం తీసుకుని తమను నాశనం చేశారంటూ సుబ్బారావు సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నా డీఎస్పీ దానికి వక్రభాష్యం చెప్పారు. చివరికి ప్రాణాలు తీసుకున్న బాధితులదే తప్పు అన్నట్లు నెపాన్ని వారిపై నెట్టేసి, వైఎస్సార్సీపీ నాయకులకు కొమ్ముకాశారు. ‘సూసైడ్ నోట్’ను న్యాయస్థానాలు సైతం మరణ వాంగ్మూలంగా, కీలక సాక్ష్యంగా పరిగణిస్తాయి.
వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు - DSP on Subbarao family Suicide
సుబ్బారావు కుటుంబం వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంది. వేరే కారణాల్లేవని డీఎస్పీ షరీఫ్ చెప్పారు. సుబ్బారావు కుటుంబానికి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఆయనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డుల్లో వైఎస్సార్సీపీ నాయకుడైన కట్టాక నారాయణయ్య అనుచరురాలు శ్రావణి పేరిట మార్చేశారు. వైఎస్సార్సీపీ నాయకులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అక్రమానికి పాల్పడ్డారు. ఆ భూమి అమ్ముకునేందుకు అవకాశం లేకపోవటంతో వేరే దారి కనిపించక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారి సూసైడ్‌నోట్ చదివితే ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అలాంటప్పుడు వ్యక్తిగత కారణాలతోనే వారు ప్రాణాలు తీసుకున్నారని డీఎస్పీ ఎలా తేల్చేస్తారు? అధికారపార్టీ నాయకుడిని, రెవెన్యూ అధికారులను ఎందుకు విచారించరు?
రెవెన్యూ రికార్డుల్లో మార్పులు కట్టా శ్రావణి పేరిట భూ బదలాయింపు 2017లోనే జరిగిందని డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. కట్టా శ్రావణి తండ్రి సుబ్బరాయుడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. ఉద్యోగం నిమిత్తం 20 ఏళ్ల కిందట గ్రామం వదిలి వెళ్లారని డీఎస్పీ చెప్పారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో ఉన్నారని శ్రావణి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారని చెప్పారు. ఈ సర్వే నంబరుకు, తమకు సంబంధం లేదని వారు చెప్పారన్న డీఎస్పీ సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు భూ సమస్య కారణం కాదని, అప్పులే ప్రధాన కారణమని తేల్చేశారు. పాత తేదీలతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన ఘటనలు జిల్లాలో అనేకం వెలుగుచూశాయి. అలాంటప్పుడు 2017లోనే కట్టా శ్రావణి పేరిట భూ బదలాయింపు జరిగిందని డీఎస్పీ ఎలా తేల్చేస్తారు? దానికున్న శాస్త్రీయ ఆధారాలేంటి? సుబ్బారావు తండ్రి పేరిట ఉన్న భూమి 2017లోనే శ్రావణి పేరిట మారిపోతే 2020 వరకూ పీఎం కిసాన్ కింద సుబ్బారావు తండ్రికి ఆర్థికసాయం ఎలా అందిందో ఆయనే చెప్పాలి. సుబ్బారావు తన తండ్రి పేరిట ఉన్నదిగా చెబుతున్నది ఆయన భూమి కాదని అది ప్రభుత్వ భూమి అని డీఎస్పీ సెలవిచ్చారు. అది కట్టా శ్రావణి పేరిట అప్పట్లో మారిపోయిందనీ చెప్పారు. ప్రభుత్వమే కొన్ని సంవత్సరాల క్రితం సుబ్బారావు తండ్రి వెంకటాచలపతికి ఆ భూమిలో డీకేటీ పట్టా ఇచ్చింది. ఆ తర్వాత దానిపై పట్టాదారు పాస్‌పుస్తకం జారీ అయ్యింది. పీఎం కిసాన్ పథకం ద్వారా సుబ్బారావు తండ్రికి ఆర్థికసాయం అందింది. ఆయన హక్కుదారుడు కాకపోతే సాయం ఎలా అందుతుంది? పట్టా ఉన్న భూమిని ప్రభుత్వభూమిగా ఎలా తేల్చేస్తారో డీఎస్పీకే తెలియాలి.
"ప్రభుత్వం తరపు నుంచి సుబ్బారావు కుటుంబానికి డీకేటీ పట్టా ఇవ్వలేదు. చెడు అలవాట్ల వల్ల అప్పులు చేసాడు. ఈ అప్పులు తీర్చలేక సుబ్బారావు భార్యా, పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డారు."-డీఎస్పీ
సుబ్బారావు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేవారని, చెడు అలవాట్లు ఉన్నాయని డీఎస్పీ చెప్పారు. తన భూమిని ఇతరులు కాజేశారని సుబ్బారావు సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భూమిని అమ్ముకోవడానికి వీల్లేకపోవడం వల్లే ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, ఆయనదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించటం వెనుక డీఎస్పీ దురుద్దేశం స్పష్టమవుతోంది.
వైఎస్సార్ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three People Commit Suicide