DSP Chaitanya Behind Tadipatri Violence :వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీఎస్పీగా తొలి పోస్టు పొందిన చైతన్య తాడిపత్రిలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోపిడీ, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించారు. రాజంపేట డీఎస్పీగా బదిలీ అయిన చైతన్య ఎన్నికల అనంతరం తాడిపత్రికి వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడం సంచలనం రేపింది. పెద్దారెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికే చైతన్యను తాడిపత్రికి పిలిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ చైతన్యతోపాటు మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాడిపత్రిలో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన రాళ్ల దాడులకు గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ చైతన్యే కారణం అని చెప్పక తప్పదు. 2020 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య అరాచకాలు అనంతం. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులనే చితకబాది రక్తగాయాలు చేసిన ఘటనలు అనేకం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తొత్తుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న చైతన్య తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా అరాచకాలు, అక్రమ కేసుల పరంపర కొనసాగించారు. తెలుగుదేశం సానుభూతిపరులైన గొర్రెల కాపర్లనూ వదలకుండా స్టేషన్‌కు తీసుకొచ్చి చేరివేళ్లు విరిచి రక్తం ధారగా కారుతున్నా వదలకుండా కొట్టినట్లు అప్పట్లో ఆ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్దారెడ్డి అరాచకాలపు, ఇసుక దోపిడీపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ డీఎస్పీ అరాచకాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా కనీస చర్యలు తీసుకోలేదు.
తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి వెళ్లారు. డీఎస్పీ చైతన్య కనుసన్నల్లోనే అంతా జరిగినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. పెద్దారెడ్డి పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడికి వెళ్లి జేసీ లేకపోవడంతో ఇంట్లో పనిచేసేవారిని తీవ్రంగా కొట్టారు. వెంట వెళ్లిన పోలీసులు దాడిని అడ్డుకోకపోవడంతో చైతన్య కనుసన్నల్లోనే దాడులు జరిగినట్లు మీడియా సమావేశం పెట్టి జేసీ ఆరోపించారు.
దళిత సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్ మల్లికార్జునపై డీఎస్పీ చైతన్య అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. టీడీపీ నాయకుడు సోమశేఖర్‌నాయుడుపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన రవీంద్రరెడ్డిని జిల్లా బహిష్కరణ చేయించగా హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రికి వెళ్లేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు ఉత్తర్వులనూ ఖాతరు చేయని డీఎస్పీ చైతన్య తాడిపత్రికి వస్తే అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్రమ కేసుల బాధితులందరినీ అప్పట్లో రిమాండ్‌కు పంపగా అందరూ బెయిల్‌పై వచ్చి కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ కేసుల బాధితులంతా చైతన్యపై తాడిపత్రి కోర్టులో 12 ప్రైవేట్ కేసులు దాఖలు చేయగా ఇవన్నీ విచారణలో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో సుమారు 100కు పైగా డీఎస్పీ చైతన్య బాధితులు ఉన్నారు.
తాడిపత్రిలో అరాచకాలు సృష్టించిన డీఎస్పీ చైతన్యను 2023 ఏప్రిల్‌లో వైఎస్సార్ జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. ముఠా కక్షలకు ఆజ్యం పోసిన డీఎస్పీ నిర్వాకంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఇదిలా ఉండగానే పోలింగ్ రోజున తాడిపత్రి మెయిన్ బజార్‌లో వైఎస్సార్సీపీ మూకలు, తెలుగుదేశం కార్యకర్తలపై రాళ్లదాడికి తెగబడ్డారు. తెలుగుదేశం నేతలూ తీవ్రంగా ప్రతిఘటించారు. మరుసటి రోజునే వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడికి వచ్చారు. దాడిని టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించగా మంగళవారం అర్ధరాత్రి వరకు తాడిపత్రిలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను అదుపు చేయడానికి రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఆసక్తి ఉన్న సీఐ, డీఎస్పీ స్థాయిల అధికారులను తాడిపత్రికి రావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే అదునుగా భావించిన డీఎస్పీ చైతన్య రాజంపేట నుంచి అర్ధరాత్రి తాడిపత్రికి చేరుకొని స్పెషల్ పార్టీ పోలీసులను వెంటబెట్టుకుని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జేసీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ పగులగొట్టి ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. జేసీ ఇంట్లో పనిమనుషులను చితకబాదిన చైతన్య ఇంట్లో నిద్రిస్తున్న జేసీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటరైన దళిత దివ్యాంగుడు దాసరి కిరణ్‌ను బయటకు లాక్కొచ్చిన చైతన్య తల పగిలేలా లాఠీతో దాడిచేశారు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చైతన్య లాంటి వ్యక్తి.. పోలీసు ఉద్యోగానికే అనర్హుడంటూ రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
తాడిపత్రి ఘటనపై డీఎస్పీని మందలించిన ఎస్పీ - అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశం - SP Reprimanded DSP Chaitanya
తాడిపత్రిలో అగ్నికి ఆజ్యం పోసిన డీఎస్పీ చైతన్య!- జేసీ ఇంటికెళ్లి దాడి - TADIPATRI VIOLENCE