Drunk Man Sleeping On Electric Wires in Manyam District : మందు మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇలా చాలామంది అధికంగా మద్యం సేవించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. చూసేవాళ్లకు కొన్నిసార్లు ఇవి గమ్మత్తుగా ఉన్నా, మరి కొన్నిసార్లు ఒళ్లు గగుర్పుట్టిస్తుంటాయి. అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం తాగి గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద ఉన్న విద్యుత్ తీగలపై ఎక్కి సేద తీరాడు. పాలకొండ మండలం M.సింగపురం గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్న వ్యవసాయ కూలీ. ఇంట్లో కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరగడంతో విద్యుత్ తీగలపై ఎక్కాడు. అంతకుముందే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాన్ని నిలిపివేశాడు. విద్యుత్ తీగలపై వేలాడుతున్న వెంకన్నను గమనించిన స్థానికులు భయాందోళనతో కేకలు వేశారు. కొద్దిసేపటి తర్వాత వెంకన్నను కిందకు దించి దేహశుద్ధి చేశారు.