తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​లో ఆర్డర్​ చేస్తే - డైరెక్టుగా డోర్​ డెలివరీ! - హైదరాబాద్​లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్ - NIGERIAN DRUG PEDDLER IN HYDERABAD

నగరంలో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ - గుట్టుచప్పుడు కాకుండా మత్తు విక్రయాలు - నిందితులకు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు

HYDERABAD NARCOTIC WING POLICE
DRUG SALES IN HYDERABAD (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 12:16 PM IST

Drug Cases in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ఒకే రోజు రూ.7.5 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడటం సంచలనంగా మారింది. నిందితులకు అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలున్నట్టు హైదరాబాద్​ పోలీసులు గుర్తించారు. టీజీన్యాబ్, హెచ్‌న్యూ, ఆబ్కారీ, ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, స్థానిక పోలీసులు ఇలా నలువైపులా నుంచి మాదక ద్రవ్యాల కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నా, కళ్లెం వేయటం పెద్ద సవాల్‌గా మారింది.

స్మగ్లర్లు దేశవ్యాప్తంగా హ్యాష్‌ ఆయిల్‌ను సరఫరా చేసేందుకు ఒడిశాలో ఏకంగా పరిశ్రమనే నెలకొల్పినట్టు సమాచారం. ఏవోబీ (ఆంధ్రా- ఒడిశా సరిహద్దు​), ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని కొన్ని ఏజెన్సీల నుంచి గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ గోవా, బెంగళూర్, దిల్లీ, ముంబయి నుంచి హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, కొకైన్ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ నగరానికి చేరుతున్నాయి.

డెకాయ్ ఆపరేషన్ ​: సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ తేలికగా గమ్యానికి చేరుతున్నాయి. ప్రస్తుతం పార్టీ సీజన్‌, శీతాకాలం కావటం, కొత్త ఏడాది దగ్గర పడే సమయం కావటంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు, నైజీరియన్లు రంగంలోకి దిగినట్టు పోలీసు యంత్రాంగం గుర్తించింది. ప్రత్యేక బృందాలను డెకాయ్‌ ఆపరేషన్‌ కోసం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు.

బెంగళూర్​ కేంద్రం :సింథటిక్‌ డ్రగ్స్‌ దందాలో నైజీరియన్లదే పై చేయి ఉన్నట్లు తెలుస్తోంది. తమ నెట్‌వర్క్‌తో వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా దందా సాగిస్తున్నారు. బెంగళూర్‌ కేంద్రంగా డ్రగ్స్‌ లావాదేవీలు జరుగుతున్నాయి. దీని కోసం నగరంలో 30 మందికి పైగా ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

తాజాగా చందానగర్​లో పోలీసులు దాడులు నిర్వహించి రాజస్థాన్‌కు చెందిన కిషన్‌రామ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇతనికి ఏపీ, తెలంగాణలో 20 మందికిపైగా కొనుగోలుదారులున్నట్టు గుర్తించారు. మరోవైపు రాజస్థాన్, ముంబయి, దిల్లీకి చెందిన ముఠాలు తమ వద్ద ఉన్న సరకుతో నగరంలోనే మకాం వేసినట్టు సమాచారం.

పోలీసుల దూకుడుతో మత్తుముఠాలు గుట్టుచప్పుడుగా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. కొనుగోలుదారులపైనా కేసులు నమోదు చేస్తుండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గంజాయి 5 గ్రాముల ధర రూ. వెయ్యి, ఎండీఎంఏ గ్రాము రూ.20వేలు, ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌ రూ.3000, కొకైన్, హెరాయిన్‌ గ్రాముకు రూ.10వేలకుపైగా ధర పలుకుతున్నాయి.

గోవా, ముంబయి, బెంగళూరుల్లో తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించటం ద్వారా రెండు రెట్లు లాభపడటంతో ఒకప్పటి కొనుగోలుదారులు ఇప్పుడు విక్రయదారులుగా మారుతున్నారు. పెరిగిన ధరలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పెడ్లర్లు మత్తుపదార్థాలను కల్తీ చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్‌లో నిద్రమాత్రలను పొడిగా చేసి కలుపుతున్నట్టు గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో రూ.7కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details