Drug Racket In Hyderabad : రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, డ్రగ్స్ సరఫరాదారుల ముఠా ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రోజుకో కొత్త మార్గం ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. హైదరాబాద్ శివార్లు మాదక ద్రవ్యాల స్థావరాలకు అడ్డాగా మారాయి. పరిశ్రమలు, గోదాములను అద్దెకు తీసుకొని డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశ, విదేశాలకు మాదక ద్రవ్యాల ముడి సరుకును చేర వేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జూన్‌లో సంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున డైజోఫాం పట్టుబడింది.
పోలీసులు కీలక నిందితుడు అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసు లింకులను ఛేదించే క్రమంలో బోయనపల్లి పోలీసులు రూ.8.5 కోట్ల విలువైన ఎంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎంఫిటమైన్, డైజోఫాం, ఆల్ఫోజోలం, ఎండీఎంఏ డ్రగ్స్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నట్టు తాజా కేసుల్లో వెలుగు చూసింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు పలు ముఠాలు తయారీలో నిమగ్నమైనట్టు భావిస్తున్నారు. ఈ స్థావరాలకు సంబంధించిన సమాచారం సేకరించి, దాడి చేసి కట్టడి చేసేందుకు అబ్కారీ, పోలీసు, టీజీన్యాబ్ సంయుక్తంగా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ముడిసరుకుతోనే రూ.కోట్లు: సంగారెడ్డి, పటాన్‌చెరువు, జిన్నారం, జహీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో నష్టాలతో మూతపడిన, ఖాయిలా పడిన ఫార్మా పరిశ్రమలను స్మగ్లర్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఏజెంట్ల సాయంతో ఫార్మా కంపెనీలు, ప్రయోగశాలల్లో పనిచేసే సీనియర్ ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. కమీషన్‌కు ఆశపడే వారిని ఎంచుకొని ఎంఫిటమైన్, డైజోఫాం, అల్ఫోజోలం ముడిసరుకును తయారీకి వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, ముంబయి రాష్ట్రాలకు తరలిస్తున్నారు.