Drone Flying Over Deputy CM Camp Office in Mangalagiri :మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ డ్రోన్‌ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. రెండ్రోజులుగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో పోలీసులు జాతీయ రహదారి వెంట ఉన్న హోటల్స్, ఇతర భవన యజమానులను విచారించింది. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు పోలీసులు వద్దకు వచ్చి తామే డ్రోన్ ఎగర వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశంతో సర్వేలో భాగంగా జాతీయ రహదారి వెంట చిత్రాలు తీశామని, ఇందులో భాగంగానే జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై డ్రోన్ పర్యటించిందని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు వెల్లడించారు.
ఇదే విషయాన్ని జిల్లా ఏఎస్పీ రవికుమార్ తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తాడేపల్లి మహానాడులో జరిగిన ఓ చోరీ కేసు వివరాలు వెల్లడించే సమయంలో డ్రోన్ వ్యవహారాన్ని విలేకరులకు వివరించారు.