Drinking Water Scarcity in Ongole RIMS Hostels: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య కళాశాలల్లో ఒంగోలు కళాశాల ఒకటి. నీట్ ద్వారా ర్యాంకులు సాధించి ఇక్కడ సీట్లు దక్కించుకున్న విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాలంటే సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సీట్లు సంపాదించుకున్న వైద్య విద్యార్థులు వైద్యశాల ప్రాంగణంలోనే తప్పని సరిగా వసతి ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం వసతి గృహాలను సైతం నిర్మించింది. అయితే వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, సీనియర్ డాక్టర్లు, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు వెరసి దాదాపు వెయ్యి మంది వరకూ కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహాల్లో నివాసముంటున్నారు.
వీరంతా ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. దీనికి తోడు ఆసుపత్రిలో కూడా ఇదే సమస్య. రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన నీటిని పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్షం చూపుతోంది. మున్సిపల్ వేసవి చెరువు నుంచి కళాశాల, ఆసుపత్రికి సరఫరా కావాల్సిన నీరు నిలిచిపోయింది. ఒకటో వేసవి చెరువు నుంచి ఆసుపత్రిని కలుపుతూ ఏర్పాటు చేసిన పైపులైన్ కూడా దెబ్బతిని నీరు రావడం లేదు.
విధి లేని పరిస్థితిల్లో ప్రస్తుతం పాత రిమ్స్ ఆవరణలో వేసిన బోర్వెల్ నుంచి వచ్చే నీరే దిక్కైంది. అయితే అవి కూడా పూర్తి స్థాయి అవసరాలు తీర్చలేకుంది. దీంతో వసతి గృహాల్లో ఉంటున్న వైద్య విద్యార్థులు, ఆసుపత్రి ఆవరణలోని సిబ్బంది, క్యార్టర్స్లో వారికి నిత్యం క'న్నీటి' కష్టాలు తప్పడం లేదు. స్నానాలు, మరుగుదొడ్లకూ నీరు దొరక్క చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులివ్వరు - ప్రజలకి నీళ్లు అందవు - ఇలా అయితే ఎలా జగనన్నా!