Drinking Water Problems in Krishna District: తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండంటూ కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. వేసవి రాకముందే తాగునీటికి ఎద్దడి ఏర్పడిందని వాపోతున్నారు. రాబోయే కాలంలో తమ పరిస్థితి ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటికి అల్లాడుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంతో, ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కేంద్ర పథకం జల్‌జీవన్ కింద చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడం లేదు.
'మంచినీళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి'- ఖాళీ కుండలతో మహిళల నిరసన
మచిలీపట్నం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలైన కొన, పల్లెతుమ్మలపాలెం, పొలాటితిప్ప సహా పలు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యం మంచినీటి ట్యాంకుల చుట్టూ డ్రమ్ములతో ప్రజలు దర్శనమిస్తున్నారు.
"తాగునీటికి ఇబ్బందిగా ఉంటోంది. నీటి కోసం చాలా కష్టపడుతున్నాం. ఓ సమయమనేది లేకుండా నీటిని పంపిణీ చేస్తున్నారు. ఒకరోజు వదిలి మరో రోజు వదులుతున్నారు." -లక్ష్మి, కోన గ్రామం
ఆరు రోజులకోసారి మంచినీళ్లు - బ్రతికేది ఎలా అంటున్న గ్రామస్థులు