AP Voters :ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే 19,048 మంది ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. అందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803 మంది. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
నవంబర్ 28 వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనుంది. 2025 జనవరి 6న తుది జాబితా ప్రచురించనుంది. ఇందులో భాగంగా నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ డేలు ఏర్పాటు చేయనుంది. ఆయా తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతో సహా బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం అర్జీ చేసుకునేందుకు వీలుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు.
ముసాయిదా జాబితా ప్రకారం
- సాధారణ ఓటర్లు : 4,13,53,792
- సర్వీసు ఓటర్లు : 67,143
- మొత్తం ఓటర్లు : 4,14,20,935 (పురుషులు: 2,03,47,738, మహిళలు: 2,10,69,803 థర్డ్ జెండర్ 3,394)
4 లక్షలకుపైగా యువ ఓటర్లు