Donation to CMRF on Floods :విజయవాడ వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కులు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున రూ. 6 లక్షల నూట పదహారు రూపాయలు విరాళమిచ్చారు. అమలాపురం బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య 5 లక్షలు, నంద్యాల SVR ఇంజనీరింగ్ కాలేజ్ M.Dదినేశ్ రెడ్డి, కాలేజీ డీన్ సూర్యప్రకాశ్ రెడ్డి 4 లక్షలు, ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో పలాస నియోజకవర్గ ప్రజలు 2 లక్షల 90 వేలు విరాళమిచ్చారు.
నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యూఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రెండున్నర లక్షల రూపాయలు, మదనపల్లె గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ రమణారెడ్డి 2 లక్షలు, అనంతపురానికి చెందిన సురేశ్ నాయుడు లక్ష అందజేశారు. బీజేపీ మజ్దూర్ విభాగం నాయకుడు నాగేశ్వరరావు 10వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Donations For Flood Relief : వరద బాధితుల కష్టాలు చూశాక వారికి అండగా ఉండేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు వీల్‌చైర్‌లో వచ్చి విరాళాలు అందజేస్తున్న దృష్యాలు దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్కు రూ.300 కోట్లు వచ్చాయి. మరో రూ.50-100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనాలున్నాయి.