Donors Helping Youth For Competitive Exams :ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. అన్ని వసతులున్న నగరాల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటిది పల్లెల్లో వారి సమస్యలు వర్ణనాతీతం. గ్రంథాలయాలున్నా అరకొర వసతులు, లేదంటే బాగానే ఉన్నా పుస్తకాల కొరత, ఇలా ఏదో ఒకటి వారిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అలాంటి సమస్యలు ఎదురు కావొద్దంటూ కొంతమంది దాతలు సేవలందిస్తున్నారు. ఎంతో మంది తమ జీవితాల్లో స్థిరపడటానికి తోడ్పతున్నారు. మన దగ్గర ఉన్న అలాంటి గ్రంథాలయాలు? వాటి ప్రత్యేకథలు ఇప్పుడు చూద్దాం.
గ్రామానికి ఏదో చేయాలని :హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రభుత్వ పాఠశాలలో 1983లో పదో తరగతి పాసైన కొందరు పూర్వ విద్యార్థులు తమ గ్రామం కోసం తమవంతుగా ఏదైనా చేయాలి అనుకున్నారు. వృత్తిరీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడ్డా, గ్రామం బాగు కోరుకునే వీరంతా 2001 నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 2015లో లైబ్రరీని ఏర్పాటు చేసి, కొంతకాలానికి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్రామం, చుట్టుపక్కల ఊళ్లకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల శిక్షణ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పటడం, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడం గమనించారు గ్రంథాలయ కమిటీ సభ్యులు.
ఇక్కడ చదువుకుని 25 మంది ఉద్యోగం సాధించారు :అందుకే అక్కడ ఉచితంగా కంప్యూటర్ క్లాస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సివిల్స్, గ్రూప్స్, ఆర్ఆర్బీ, బ్యాంకు, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎల్ఐసీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గైడెన్స్, శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. అక్కడికొచ్చే పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రోజుకో గెస్ట్ ఫ్యాకల్టీని పిలిపించి క్లాసులు చెప్పిస్తుంటారు. స్కూలు, కాలేజీ విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తుంటారు. పోలీస్, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిని ప్రోత్సహించడం కోసం ఆటల పోటీలనూ ఏర్పాటు చేస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో చదువుకున్న వారిలో దాదాపు పాతిక మంది వివిధ పోటీ పరీక్షలు రాసి, ప్రభుత్వ ఉద్యోగాల్ని సొంతం చేసుకున్నారంటే ఎంతో గొప్ప విషయం కదూ.