Fish medicine in Hyderabad :ఏటా మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఉబ్బసం, ఆస్తమా రోగాలతో పాటు ఇతర రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు. దాదాపు 6 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి తరలి వచ్చారు. నిర్వాహకులు చేప ప్రసాద పంపిణీకి 34 స్ఠాళ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 1200 మంది పోలీసులు పాల్గొన్నారు.
Special Buses for Fish Medicine : చేప మందు కోసం వచ్చే వారి సౌలభ్యం కోసం టీజీఎస్ఆర్టీసీ 130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది.
చేపమందుకు వచ్చే వారికి భోజన ఏర్పాట్లు :మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది. రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి భోజనం అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. చేప మందు పంపిణీకు టోకెన్లను ఇవాళ నుంచే విక్రయిస్తుండటంతో ఒక రోజు ముందే చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. చేపమందు పంపిణీ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.