AP CM Chandrababu Providing Essential Goods at Discount :రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్లలో బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి కొనుగోలుదారులకు బియ్యం, కందిపప్పు అందజేశారు. ఈ కౌంటర్లో కందిపప్పు రూ.160, సోనా మసూరి బియ్యం కిలో రూ.49కి విక్రయించనున్నారు.
రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలసి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రాయితీ సరకులు పంపిణీ చేశారు. గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కర్నూలులో జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య కందిపప్పు, బియ్యం విక్రయాలను ప్రారంభించారు. రైతుబజార్లలో రాయితీపై అందిస్తున్న సరకులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Stalls for Essential Commodities :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయితీతో కందిపప్పు, బియ్యం అందిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మచిలీపట్నం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ల ద్వారా మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరకే కంది పప్పు, బియ్యం అందిస్తున్నామన్నారు.
విజయనగరం దాసన్నపేట రైతు బజార్‌లో సంయుక్త కలెక్టర్ కార్తీక్‌తో కలిసి ఎమ్మెల్యే అదితి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందజేశారు. దేశంలోనే మెుదటి సారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సంక్షేమాన్ని తీసుకొచ్చారని వివరించారు. ప్రస్తుతం కొన్ని నిత్యవసర వస్తువులు రైతు బజార్లలో అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. మరికొన్ని త్వరలో వస్తాయని తెలిపారు.
జగన్ ప్రభుత్వంలో జనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఐదేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు రెండు మూడింతలయ్యాయి. ఇంటి బడ్జెట్ పెరిగిపోయి సామాన్య జనం అల్లాడిపోయారు. నెలవారీ ఇంటి ఖర్చులు కనీసం 15 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలకు చేరాయి.