Disruption of Drinking Water Supply Due to Leakage Pipe Lines:కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు తయారైంది గుంటూరు నగర వాసుల పరిస్థితి. పాత పైపు లైన్ల లీకులతో తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు ఆ స్థానంలో కొత్త పైపు లైన్లు వేశారు. అసలు సమస్య ఆ తరువాతే మెుదలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైపు లైన్లు మార్చినప్పటి నుంచి దుర్గంధంతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతుందని పాత గుంటూరు పరిసర ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. తాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం ఇంట్లో కనీస అవసరాలకు సైతం వాడుకోలేనంత ఘోరంగా కార్పొరేషన్ వారు నీటిని సరఫరా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఒంగోలులో దాహం కేకలు- తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు
People of Guntur Are Desperate For Drinking Water:గుంటూరు ప్రజలు గుక్కెడు స్వచ్ఛమైన తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. గత కొంతకాలంగా కార్పొరేషన్ సరఫరా చేసే తాగునీరు కలుషితమై రావడంతో ఆ నీటిని వినియోగించి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద నగర పాలక సంస్థల్లో ఒకటిగా ఘన చరిత్ర కలిగిన గుంటూరు కార్పొరేషన్ నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు కాలనీలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంలో ఆలసత్వం చూపుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బీఆర్ స్టేడియం వద్ద అధికారులు పైపు లైన్లకు మరమ్మతులు నిర్వహించారు. కొన్ని ప్రాంతాలకు కొత్త లైన్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బీఆర్ స్టేడియం పరిసరాలు, సంగడిగుంట, తిరుమలాచారి కాలనీ, పాత గుంటూరు, యాదవ బజారు తదితర ప్రాంతాల్లో దుర్గంధంతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు వాసులకు నీటి కష్టాలు తప్పవా - అధికారులు పట్టించుకోరా!
Drinking Water Problem in Guntur: గతంలో వానలు పడినప్పుడు, అప్పుడప్పుడు మాత్రమే కలుషిత నీరువచ్చేదని, కొత్త పైపు లైన్లు వేయడం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతుందని ఆశ పడితే నిరాశే ఎదురైందని పాత గుంటూరు వాసులు వాపోతున్నారు. పైపులైన్లు వేసే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే నీటి సరఫరా సమయంలో మురుగునీరు కలుస్తుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. రంగు మారి, దుర్వాసనతో కూడిన నీరు తాగేందుకు ఏ మాత్రం పనికిరావడం లేదంటున్నారు. డబ్బులు పెట్టి రోజుకు రెండు డబ్బాల మినరల్ వాటర్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కనీస అవసరాలకు ఉపయోగించినా పిల్లలకు చర్మవ్యాధులు, దురద లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లివ్వలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే - తాగునీటి కోసం మహిళల ఆందోళన
Repairing The Water Pipelines: పైపులైన్ల మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు పాటు అపరిశుభ్ర నీరు సరఫరా అవుతుంది ఆందోళన చెందవద్దని నగరపాలక సంస్థ అధికారులు చెప్పారన్నారు. రెండు వారాలు గడిచినా కలుషిత నీటి సమస్య తీరలేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో డబ్బులిచ్చి ట్యాంకుల ద్వారా నీటి తెప్పించుకోక తప్పడం లేదంటున్నారు. ఒకటి, రెండు రోజులంటే ఏదో ఒకవిధంగా సర్దుకుపోతామని, పదిరోజులు దాటినా అధికారులు పట్టించుకోకపోతే ఏంచేయాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు కలుషిత తాగునీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
తాజాగా తిరుమలాచారి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడానికి కూడా ఈ కలుషిత నీరే కారణమనే సందేహాన్ని నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కలుషిత తాగునీటి వల్ల డయేరియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున....వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని స్థానిక కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కమిషనర్, మేయర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల జీవితాలతో చెలగాటమాడకుండా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు స్వచ్చమైన శుద్ధి చేసిన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
'ఓట్లు వేయించుకుని వదిలేశారు' - మూడు నెలలుగా తాగునీటికి అల్లాడుతున్న జనం
పైపులైన్ల లీకులతో ఇబ్బందులు- కలుషిత నీటితో అల్లాడుతున్న ప్రజలు