Discussion On Water Shares Between AP and Telangana in Hyd :నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరాలపై ఓ నిర్ణయానికి రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ సూచించారు. రెండు రాష్ట్రాల సంబంధిత చీఫ్ ఇంజనీర్లు మంగళవారం సమావేశమై ఓ అభిప్రాయానికి రావాలన్నారు. ఆ తర్వాత బుధవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి విడుదల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
అవి పరిగణలోకి తీసుకోరాదు : ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నందున నిలువరించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బోర్డు ఛైర్మన్‌ను కోరారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, తదితరాల ఔట్ లెట్ల నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తి ఆపాలని అన్నారు. తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పది టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలని కోరారు. సముద్రంలోకి వృథాగా పోయే వరదనీటిని తాము వినియోగించుకున్నామని పరిగణలోకి తీసుకోరాదని ఏపీ ఈఎన్సీ అన్నారు. సాగర్, శ్రీశైలం కింద పంటలు ఉన్నాయని వాటికి సరిపడా నీరు అవసరమన్నారు.