Ram Gopal Varma : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఆర్జీవీని ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆర్జీవీ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కేసులకు తానేం భయపడటం లేదని వీడియోలో తెలిపారు. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని అని అన్నారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మండిపడ్డారు. అమెరికా, యూరప్‌లో లాగే ఇక్కడ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. అయినా హత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.
అసలేం జరిగింది : సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మీద అసభ్యకరమైన పోస్టులు చేశారంటూ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీపై ఏపీలోని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరుకావాలని ఈనెల 19న ఆర్జీవీకి హైదరాబాద్‌లోని తన ఆఫీసుకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు రాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో వారం రోజుల్లో విచారణకు వస్తానని.. వాట్సాప్‌లో దర్యాప్తు అధికారికి సందేశం పంపించారు.