Diarrhea Cases in Palnadu District:పల్నాడు జిల్లాలో రోజురోజుకు డయేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో 3 నుంచి 5 అతిసారం కేసులు నమోదవగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. పిడుగురాళ్ల , మాచర్ల పట్టణాల్లో ప్రధానంగా వాంతులు, విరోచనాలు లాంటి డయేరియా అనుమానిత లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు.
పిడుగురాళ్లలో వాంతులు, విరేచనాలతో రెండు రోజుల్లోనే 15 మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడం కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందట సిద్ధిక్ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తాగునీరు సమస్యతోనే తాము డయేరియా బారిన పడినట్లు ప్రస్తుతం ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని రోగులు చెబుతున్నారు.
పిడుగురాళ్లలోడయేరియా ప్రబలడంతో వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతిసారం అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న మారుతినగర్, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలకు ఉపక్రమించారు. డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండి అతిసారం లక్షణాలతో వస్తున్న బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.