Dhone-Somayajulapalli National Highway Works :గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రజలు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్న ఘటనలే కనిపిస్తున్నాయి. రహదాలు సరిగ్గా లేక జరిగిన ప్రమాదాలు అనేకం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్కడి ప్రయాణికులకు నిత్యం నరకం తప్పటం లేదు. రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉండగా నేటికి ఆ పనులు పూర్తికాక వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నత్తనడకన సాగుతున్న డోన్-సోమయాజులపల్లె జాతీయ రహదారి పనులపై కథనం.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో- ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్న ప్రజలు (ETV Bharat) వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు 340B పేరుతో డోన్ నుంచి ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె మధ్య 53 కిలోమీటర్ల మేర రహదారిని మంజూరు చేసింది. కానీ జగన్ ప్రభుత్వం రైతులను ఒప్పించి పూర్తి స్థాయిలో భూసేకరణ చేపట్టలేకపోయింది. హెచ్ కొట్టాల, సోమయాజులపల్లెకు చెందిన కొందరు రైతులు తమ భూములకు తక్కువ పరిహారం ఇస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు ఆగిపోయాయి. మరోవైపు రంగాపురంలో రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలకు పరిహారం చెల్లించకపోవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది.
చిన్న మల్కాపురం నుంచి డోన్ వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!
'హైవే నిర్మాణం జరుగుతుందని చాలా సంతోషపడ్డాం. కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దుమ్ము, ధూళి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి పూట ఈ దారిగుండా పోవాలటే భయపడుతున్నాం. మల్కాపురం నుంచి డోన్ వరకు మరీ సమస్యాత్మకంగా ఉంటుంది. భూ సేకరణ, పెండింగ్ పరిహారాలు అందించి కూటమి ప్రభుత్వం దీన్ని త్వరగా పూర్తి చెయ్యాలని కోరుతున్నాం.' -స్థానికులు
అక్కడక్కడా మిగిలి ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తయ్యేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
'రోడ్లు బాగు చేయండి' - డ్రోన్‌తో యువత వినూత్న నిరసన