Deputy CM Pawan Kalyan Visited Book Festival in Vijayawada : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం సందర్శించారు. రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాల్ని కొన్నారు. వీటిలో కొన్నింటిని పిఠాపురంలో పెట్టబోయే గ్రంథాలయంలో ఉంచనున్నట్లు సమాచారం. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకుల కోసం పుస్తక మహోత్సవంలోని స్టాళ్లు తెరచి ఉంచుతారు. కానీ పుస్తక ప్రేమికుడైన పవన్ కల్యాణ్ తన కోసం ఉదయం 2 గంటలపాటు స్టాళ్లు తెరిచి ఉంచాలని కోరారు. పవన్ విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు శనివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి రెండు గంటలపాటు ముఖ్యమైన స్టాళ్లను తెరిచి ఉంచారు. పుస్తక మహోత్సవానికి చేరుకున్న పవన్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లోని తనకిష్టమైన పుస్తకాలను కొనుగోలు చేశారు. వీటిలో డిక్షనరీలు ఎక్కువగా ఉన్నాయి.
వాటన్నింటినీ కొనుగోలు చేసిన పవన్ : చిన్నతనంలో తనను అమితంగా ప్రభావితం చేసిన "ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్" పుస్తకాన్ని స్టాళ్లలో ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ కావాలని వాటన్నింటినీ కొనుగోలు చేశారు. ఇది తనకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. ఆ పుస్తకం చదివితే నిరాశా నిస్పృహలు తొలగి, ఆశావహ దృక్పథం అలవడుతుందన్నారు. రచయిత రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీల నిర్బంధంలో ఉన్నప్పుడు రాసిన పుస్తకమిదని వివరించారు. తన వద్దకు వచ్చే వారికి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలని తన ఉద్దేశమని పవన్ అన్నారు. ఇప్పటికే ఈ పుస్తకం 12 మిలియన్ల కాపీలను విక్రయించింది. ప్రకృతి వ్యవసాయం, పాథాలజీ, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, అమ్మడైరీలో కొన్ని పేజీలు వంటి పుస్తకాలను కొనుగోలు చేశారు. సైబర్ సెక్యూరిటీ, క్లైమేట్ ఛేంజ్, చరిత్ర, ఆర్థిక, సామాజిక, రాజనీతి శాస్తాలకు సంబంధించిన పుస్తకాలను కూడా కొనుగోలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు, పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ పుస్తకాల కొనుగోలుకు ఆసక్తి చూపారు.