Deputy CM Pawan Kalyan Warning : మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపును ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వమే కాని, మెతక ప్రభుత్వం కాదని పవన్ అన్నారు. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం (Forest Department Martyrs Remembrance program)లో ఆయన మాట్లాడారు.
ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలి :అటవీ శాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూదని తెలిపారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5కోట్ల విరాళం సేకరించి ఇస్తానని, భవిష్యత్తులో అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులర్పిద్దామని అన్నారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని వెల్లడించారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని, అమరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలని ఆయన అన్నారు.
రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్రగ్స్ - అమిత్ షాను ట్యాగ్ చేసిన పవన్ కల్యాణ్