Jal Jeevan Mission Scheme in AP : కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి? క్షేత్ర స్థాయిలో పనులు ఏ విధంగా చేశారు? అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్ర నుంచి రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఐదేళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకూ ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై పవన్ ఆరా తీశారు. దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నదీ లేనిది పరిశీలన చేయనున్నారు.
YSRCP Neglect on Jal Jeevan Mission :గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చాలా వెనుకబడి ఉంది. ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవహారాలు, సాంకేతిక అంశాల నుంచి అంతిమంగా ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకోసం జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి కనిపించాలనీ ఇప్పటికే 11 రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని ఈ ఏడాది ఆ జాబితాలో రాష్ట్రం కూడా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.