Central Govt Good Samaritan Scheme : కళ్లముందు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకురారు. ఒకవేళ కాపాడితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందోనన్న భయం. అందుకే గాయపడిన వారిని చూస్తూ ఉంటారు తప్ప చలించరు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులపై తరచూ చూస్తూనే ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే గుడ్ సమరిటన్ అనే పథకం తీసుకొచ్చింది. క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా చేస్తే రూ.5000 ప్రోత్సాహకంగా అందించేది. ఇప్పుడు ఆ నగదును ఏకంగా రూ.25వేలకు పెంచింది.
ఎక్కువ మందిని కాపాడితే రూ.లక్ష : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సాయం అందక, సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులను గోల్డెన్ అవర్(ఘటన జరిగిన గంటలోపు)లో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. ఇక నుంచి బాధితులను కాపాడిన వారికి పోలీసు కేసుల భయం లేకుండా కేంద్రం ప్రవేశపెట్టిన గుడ్ సమరిటన్ చట్టం దోహదపడుతుంది. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడితే రూ.లక్ష అదనపు ప్రోత్సాహం అందిస్తున్నారు.
కేసుల భయం అవసరం లేదు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందనే అపోహలొద్దని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరావు తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లినా, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాద కేసులకు సాక్షులుగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
ప్రోత్సాహం పొందాలంటే : ప్రాణాపాయంలో బాధితులను ఆసుపత్రులకి తీసుకెళ్లాక సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. అనంతరం పోలీసులు అధికారికంగా లేఖ ఇస్తారు. తరువాత బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పోలీసుశాఖ, ఆసుపత్రి ధ్రువీకరణ పత్రాలను జత చేసి మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యశాఖ, జాతీయ రహదారుల సంస్థ, రహదారుల భద్రత శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సమారిటన్ గుర్తించి నగదు ప్రోత్సాహకానికి ఎంపిక చేస్తుంది.
రోడ్డు ప్రమాదం బాధితులను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్తే ఒకరి ప్రాణమే కాదు, ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడినవారు అవుతారని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలత తెలిపారు. అలాంటి వారిని ప్రభుత్వం ప్రాణదాతగా గుర్తించి ప్రశంసాపత్రంతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని చెప్పారు.