Deputy CM Pawan Kalyan on Sajjala Estate Scam :వైఎస్సార్ జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ, డీకేటీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. సజ్జల కుటుంబ ఎస్టేట్‌లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారంపై సర్వే అధికారులు ఇవాళ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలిబిడికి గ్రామం వద్ద దాదాపు 200 ఎకరాల్లో సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల ఎకరాలు పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
తెలియదు, గుర్తు లేదు - పోలీసులకు సజ్జల సమాధానం
సుగాలిబిడికిలోని సర్వేనంబర్ 1629లో 40 ఎకరాల వరకు అటవీ భూములు కొట్టేశారనే ఫిర్యాదులు వచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో కడప డీఎఫ్‌ఓగా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టా భూముల్లోకి అటవీ భూములను కలిపేసుకుని లీగలైజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల ఎస్టేట్ భూములకు కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవర్నీ అనుమతించడంలేదు. ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. ఇందులో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ భార్య బుక్కే దేవి పేరిట ఎకరా 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట ఎకరా 30 సెంట్ల డీకేటీ పట్టాను 1993లో ప్రభుత్వం అందజేసింది.