Bhatti Vikramarka that Another DSC will be Released Soon :తెలంగాణలో ఇదే చివరి డీఎస్సీ కాదు, మరిన్ని తీస్తామని త్వరలో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని తెలిపారు. మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. 19,717న మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీలు చేసినట్లు తెలిపారు.
ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు వస్తున్నాయి :ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంచామని, ఇప్పటికే 2,00,500 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. త్వరలో పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. డీఎస్సీకి అభ్యర్థులు కొన్ని నెలలుగా సిద్ధం అవుతున్నారని, అందుకే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదన్న విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు.
విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యనందించాలని డీఎస్సీ ప్రకటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని విమర్శించారు. పదేళ్లు డీఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయపడ్డారని ఆరోపించారు. ఐదు వేలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించనందుకు తమ ప్రభుత్వం రాగానే 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.