Kharif Season Paddy Purchase in Telangana :ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమైంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ధాన్యం సేకరణ ఏర్పాట్లు, సమస్యలు, సన్నాలకు రూ.500 బోనస్, సన్నాలు, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించి మిల్లులకు తరలించడం, రైతులకు సకాలంలో చెల్లింపులు, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు, మిల్లర్లతో చర్చించారు. సన్నాలు, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించేందుకు కలెక్టర్లు నిర్దేశించిన విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
సన్న రకం ధాన్యం గుర్తించడం కోసం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. సన్నాలు, దొడ్డు రకాలను గుర్తించేలా సన్నరకం వరి సంచులను ఎరుపు దారంతో, దొడ్డు రకం సంచులను ఆకుపచ్చ దారంతో కట్టాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సన్నాలు, దొడ్డు రకాలను వేర్వేరుగా మిల్లులకు రవాణా చేయనున్నారు. మిల్లర్లు వాటిని వేర్వేరుగా నిల్వ చేస్తారు. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకంపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణలో నాణ్యతను పక్కాగా పరిశీలించేందుకు డిజిటల్ గ్రెయిన్ కాలిపర్‌లు, పొట్టు తొలగించే యంత్రాలు వంటి ప్రత్యేక పరికరాలను అందజేయనున్నారు.
'సన్న రకం ధాన్యం ఎక్కువగా రావాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు సన్నాలకు రూ.500 బోనస్ ప్రోత్సాహకంగా అందిస్తోంది. మిల్లర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది' - డీఎస్ చౌహాన్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి