Rythu Bharosa Workshop In Khammam :రైతుభరోసా మార్గదర్శకాల కోసం క్షేత్రస్థాయిలో ప్రభుత్వమే కదిలింది. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఖమ్మంలో అభిప్రాయసేకరణ చేపట్టింది. రైతుబంధు పథకం అమలులో తలెత్తిన లోపాలను సరిదిద్ది చిన్న, సన్నకారు రైతులకే పెట్టబడి సాయం అందేలా చూస్తామని భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. తొలుత ఉమ్మడి జిల్లాలవారీగా ప్రజలు, రైతుసంఘాల నుంచి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాక తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సాగు రంగాన్ని కాపాడుకుని దానిపై ఆధారపడ్డ కర్షకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
DY CM Bhatti Vikramarka On Rythu Bharosa :ఖమ్మంలో రైతు భరోసాపై అభిప్రాయసేకరణ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావులతో కలిసి పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న మంత్రి రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
రైతులు పెద్దఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందాం. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతుభరోసా ఇస్తామని చెప్పాం. అమలు చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నాం. ఇప్పటికే రైతుబంధు కింద రైతులకు నిధులు విడుదల చేశాం. ఈ నెలలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. రైతు భరోసా విధివిధానాల కోసం కేబినెట్ సబ్‌కమిటీ నియమించాం. రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నాం. -భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం