Deficit Rainfall in Six Districts of Telangana :రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత నెలలో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడ్డాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా, సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైంది. అయినప్పటికీ మాత్రం 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొంది. మరో 8 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి.
143 మండలాల్లో తీవ్రమైన లోటు:రాష్ట్రంలోనిఆరు జిల్లాల్లో 143 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, రంగారెడ్డిలో 27 , నిజామాబాద్‌లో 29, సంగారెడ్డిలో 27, వికారాబాద్ జిల్లాలోని 19, కామారెడ్డిలో 23 మండలాలు లోటును ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడిన మెుదట్లోనే రైతులు మొక్కజొన్న, పత్తి, మొదలగు పంటలకు విత్తనాలు వేశారు. కాగా లోటు వర్షపాతం రైతుల పాలిట శరాఘాతంలా మారింది. నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో, వాటిస్థానంలో మరోసారి విత్తనాలు నాటిన రైతులు, వర్షాల రాకకోసం నింగివైపు చూసే పరిస్థితులు నెలకొంది.
- ఎనిమిది జిల్లాల పరిధిలోని 138 మండలాల్లో సాధారణ స్థాయిలో (సాధారణ వర్షపాతానికి 19 శాతం అటూ ఇటూ)గా వర్షాలు కురిశాయి.
- 6 జిల్లాల్లోని 147 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
- మిగిలిన 13 జిల్లాల్లోని మండలాల్లో సాధారణం కన్నా 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదయింది.