RAIN ALERT IN AP : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది బంగాళాఖాతంలో ఉత్తర దిశగా పయనిస్తూ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
40-50 కిలోమీటర్ల వేగంతో : అలాగే తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో రెండ్రోజులు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. కళింగపట్నం-మచిలీపట్నం వరకు అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా మెంటాడలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించారు. తీవ్ర అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మెఘావృతమైంది. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుముల తో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అలర్ట్ - బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రలో రెండ్రోజులు భారీ వర్షాలు