ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుబారా కొండంత- ఆస్తుల సృష్టి గోరంత! ఉపయోగం లేని వాటికే అత్యధిక వ్యయం

Debts Incurred by Jagan Govt in 5 Years: ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే ఆశయం అన్నట్లుగా జగన్‌ సర్కార్‌ వేల కోట్లు రూపాయల అప్పులు చేస్తోంది. వాటితో సంపద ఏమైనా సృష్టిస్తున్నారా అంటే అలాంటిదేమీ లేదు. ఉపయోగం లేని అంశాలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న అప్పులో ఏకంగా 86శాతం ఉపయోగపడని వ్యయంతో జగన్‌ సర్కార్‌ చెత్త రికార్డు సృష్టించింది.

ap_loans
ap_loans

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 1:46 PM IST

Updated : Mar 15, 2024, 2:23 PM IST

Debts Incurred by Jagan Govt in 5 Years:అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ ఎందుకు అప్పు చేస్తున్నాం వచ్చిన సొమ్ములతో ఏం చేస్తున్నామనేది కీలకం. వైసీపీ సర్కారు జీఎస్​డీపీలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు తెచ్చుకుంటోంది. ఆస్తుల్నీ తాకట్టు పెడుతోంది. లెక్కకు మిక్కిలి గ్యారంటీలు ఇస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో అంతకుముందున్న పరిమితిని తనంతట తానే పెంచేసుకుని అదనపు అప్పులు తీసుకుంటోంది. ఇలా తెచ్చిన అప్పుల్ని మూలధన ఖర్చుగా వినియోగించకుండా ఎలాంటి ప్రతిఫలం ఇవ్వని రెవెన్యూ వ్యయంగా మార్చేస్తోంది.

ఒక కుటుంబం రుణం తీసుకుని విందులు, వినోదాలకు ఖర్చు చేస్తే అది వారికి గుదిబండగా మారుతుంది. అలా కాకుండా ఆ అప్పుతో ఇల్లు నిర్మించుకుంటే సంపదను సృష్టించుకున్నట్లవుతుంది. ప్రతి కుటుంబానికీ ఈ విషయం తెలియంది కాదు. అర్థం కానిదీ కాదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం జగన్‌కు మాత్రం అర్థం కావడం లేదు.

సాక్షి సర్క్యులేషన్‌ గణాంకాలను ప్రచురించొద్దు- దిల్లీ హైకోర్టు

రుణాలు ఎక్కువ ఆస్తులు తక్కువ: జగన్‌ సర్కారు అనేక అనధికారిక అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తోంది. కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణం తీసుకున్నా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ఎంత అప్పు తెచ్చారనే అంశాలను కాగ్‌ అడిగినా ప్రతినెలా ఇవ్వడం లేదు. కేవలం బహిరంగ మార్కెట్‌ రుణాలు లేదా ఇతర రుణాలు కలిపి కాగ్‌కు వైసీపీ ప్రభుత్వం తెలియజేసిన వివరాల ప్రకారం తెచ్చిన రుణాల్లో చాలా తక్కువ మొత్తలో మాత్రమే ఆస్తులను సృష్టించేందుకు ఉపయోదిస్తోంది. ఒకవైపు రుణాలు ఎక్కువగా ఉంటే మరోవైపు వాటిలో సగమైనా ఆస్తులను సృష్టించేందుకు ఖర్చు చేయడం లేదు.

బడ్జెట్‌ అంచనాల సమయంలోనే మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కేటాయింపులు 12 శాతం నుంచి 14 శాతం లోపు ఉంటున్నాయి. అసలు కేటాయింపులే తక్కువ. అలాంటిది ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత చేసిన ఖర్చులను చూస్తే మరీ విస్తుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కింద 10 శాతమైనా ఖర్చు చేయని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం:బడ్జెట్‌ రూపకల్పనకు, అమలుకు 'ఫిస్కల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ రెస్పాన్సిబిలిటీ'- ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఎంతో కీలకం. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి వచ్చే రాబడులు మొత్తం కలిపితే రెవెన్యూ ఆదాయం అవుతుంది. రాష్ట్ర రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు, గ్రాంట్లను కలిపితే వచ్చేది రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడికి, రాష్ట్రం చేసే రెవెన్యూ ఖర్చు సమానంగా ఉండాలి. అప్పుడే బడ్జెట్‌లో రెవెన్యూ లోటు లేకుండా ఉంటుంది. అప్పుడు తీసుకునే ప్రతి రుణంలో ఎక్కువ భాగాన్ని మూలధన వ్యయం కోసం వినియోగించడానికి వీలవుతుంది. అంటే అప్పులు చేసి ఆస్తులను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. కానీ రెవెన్యూ వ్యయం కోసం మాత్రమే అప్పులు చేయడం అనేది ప్రమాదకరమైన పరిణామం. జగన్‌ సర్కారులో అది మరీ విశృంఖలమైంది.

జగన్​కు అమరావతిపై తగ్గని కసి - మరింత దెబ్బతీసేందుకు ప్రణాళికలు

ఈ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులను జగన్ సర్కారే స్వయంగా సృష్టిస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఏ ఏడాది ఎంతమేర అప్పులు చేసింది. అందులో మూలధన వ్యయంగా ఎంత ఉందో పరిశీలిస్తే ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ రుణంలో కేవలం బహిరంగ మార్కెట్‌ రుణం, విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, నాబార్డు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలే కలిపి ఉంటాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణ మొత్తాలు లేవు. కార్పొరేషన్ల రుణాలను మినహాయించినా సరే ఆర్థిక పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది.

వైసీపీ చేసిన అప్పులు:

  • వైసీపీ ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పులు, ఆస్తుల సృష్టి వ్యయాన్ని పరిశీలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 51 వేల 687 కోట్లు అప్పుగా తెచ్చారు. ఇందులో 17 వేల 598 కోట్లు మాత్రమే ఆస్తుల సృష్టికి వినియోగించారు. అంటే 34.04 శాతం. తెచ్చిన అప్పులో 65.96 శాతం ఉపయోగపడని వ్యయంగా ఉంది.
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో 57 వేల 435 కోట్లు రుణంగా తీసుకున్నారు. 20 వేల 690 కోట్లు మాత్రమే ఆస్తుల సృష్టి కోసం ఖర్చు చేశారు. అంటే 36.02 శాతం. తీసుకున్న అప్పులో 63.98 శాతం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
  • 2021-22 సంవత్సరంలో 53 వేల 284 కోట్లు అప్పుగా తీసుకోగా అందులో ఆస్తుల సృష్టికి 18 వేల 510 కోట్లు ఖర్చు చేశారు. 34.73 శాతమే వ్యయం చేశారు. ఆస్తుల సృష్టికి ఉపయోగపడని ఖర్చు 65.27 శాతం ఉంది.
  • 2022-23 సంవత్సరంలో 67 వేల 985 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇందులో కేవలం 9 వేల 17 కోట్లు మాత్రమే ఆస్తుల సృష్టికి ఖర్చు చేశారు. అంటే 13.26 శాతమే ఎందుకు ఉపయోగపడని ఖర్చు 86.74 శాతం ఉండటం తీవ్ర ఆందోళన కలిస్తోంది. ఈ అప్పుల్లో కార్పొరేషన్ల రుణాలు లేవు. వాటినీ కలిపితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఉహించలేం.

సీఎంకు దగ్గరోడు దోపిడీల్లో తగ్గనోడు - సొంత పార్టీ నేతలూ అతని బాధితులే

గుదిబండలా మారనున్న వడ్డీలు:జగన్‌ ఐదేళ్ల ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌ అడుగులు అభివృద్ధి వైపు పడలేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించింది. రెండు, మూడింటి నిర్మాణాలు నామమాత్రంగా పూర్తయ్యాయి. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిన ఉదంతాలు లేవు. పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించలేదు. రహదారుల నిర్మాణమూ లేదు. పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేల అనుసంధానం పెంచే పనులేవీ చేయలేదు. మరోవైపు సేవారంగం విస్తృతికి అవసరమైన అవకాశాలను కల్పించలేదు.

జగన్‌ సర్కారు నాలుగేళ్లలో చేసిన అప్పులో కేవలం 28శాతం మాత్రమే ఆస్తుల సృష్టికి వినియోగించారు. మిగిలిన 72 శాతాన్ని రెవెన్యూ వ్యయంగానే మళ్లించేశారు. ముఖ్యంగా 2022-23లో రెవెన్యూ వ్యయం ఏకంగా 86.74శాతంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ పెడధోరణి కారణంగా రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు గుదిబండలా మారనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ మున్ముందు మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది.

'దుబారా కొండంత ఆస్తుల సృష్టి గోరంత' - ఉపయోగం లేని వాటికే అత్యధిక వ్యయం
Last Updated : Mar 15, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details