Dead Body Parcel Case Update: పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన పార్సిల్లో శవం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పార్సిల్లో వచ్చిన మృతదేహం కాళ్ల మండలం గాంధీనగరంవాసి బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. మృతుడి స్వగ్రామానికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.
ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన తులసి ఇంటికి ఈనెల 19న పార్సిల్లో మృతదేహం వచ్చింది. దీనిపై తులసి ఫిర్యాదుతో నేరుగా ఎస్పీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతదేహం పార్సిల్ వచ్చిన రోజు నుంచి అదృశ్యమైన తులసి చెల్లెలి భర్త శ్రీధర్‌వర్మ పార్సిల్ మృతదేహం వెనుక ఉన్నట్లు నిర్ధారించారు.
ఒక్కోసారి ఒక్కో పేరుతో మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మ, మొదటి భార్య గ్రామానికి చెందిన పర్లయ్యను హత్య చేసినట్లు తేల్చారు. ఆ తర్వాత చెక్క పెట్టెలో పార్సిల్ చేసి ఓ మహిళ ద్వారా ఆటో బుక్ చేసి తులసి ఇంటికి పంపాడని పోలీసులు తెలిపారు. 19వ తేదీ నుంచి పరారీలో ఉన్న శ్రీధర్‌వర్మ హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపారు. అలాగే తులసి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు, కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. పదేళ్ల క్రితమే భర్త దూరమైన తులసికి ఎవరు ఫోన్లు చేశారనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు.
మృతదేహం డెలివరీపై ఇంకా వీడని చిక్కుముడులు :మృతదేహం వివరాలు తెలిసినప్పటికీ ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర్‌వర్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు ఘటన జరిగిన రోజు భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద రెడ్ కలర్ కారులోంచి ఫేస్ మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అనంతరం ఆటోడ్రైవర్‌తో చెక్క పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ మహిళ ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ పార్సిల్ తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించినప్పటి నుంచి ఆమె మరిది శ్రీధర్‌వర్మ పరారీలో ఉన్నాడు.
ఇదీ జరిగింది:ఉండి యండగండి గ్రామానికి చెందిన రంగరాజు అనే వ్యక్తి కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ఇంటి నిర్మాణానికి సాయం కోసం క్షత్రియ సేవాసమితిని ఆమె ఆశ్రయించారు. తొలుత వాళ్లు ఇంటి నిర్మాణ సామగ్రి పంపించారు. 2వ విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపిస్తామని చెప్పారు. అయితే తనకు పార్సిల్ చూస్తే మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పార్శిల్‌లో మృతదేహం - ఆ కారులో వచ్చిన మహిళ ఎవరు?
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - డబ్బులివ్వకపోతే నీకు ఇదే గతి అంటూ బెదిరింపు