Cyclone in Vishakapatnam : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం (నవంబర్ 29) మధ్యాహ్నం తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శనివారం (నవంబర్ 30) మధ్యాహ్నానికి కారైకాల్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
పోర్టులకు హెచ్చరికలు :ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌ఛార్జీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం (డిసెంబర్ 02) వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.