New Trends In Cyber Crime :స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజలపై ఎలా ప్రభావితం చూపుతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన వీడియోలు చూస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లను చూసినప్పుడు ప్రైవసీ పాటించే ఆప్షన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఉన్నఫలంగా ఫోన్ వచ్చి, మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సప్ నంబర్, ఈ-మెయిల్ చిరునామాకు హెచ్చరికలు వస్తే కచ్చితంగా హడలెత్తిపోతాం. దీన్నే ఆసరాగా తీసుకొని కొత్త పంథాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. బాధితులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు.
ఈ తరహా ఫిర్యాదులు రోజూ 10 వరకు వస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులమంటూ బెదిరించి రూ.లక్షలు దోచుకుంటున్నారని వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, స్టేట్ సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూస్తున్నారని, తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలు చూసినట్లు తేలిందని భయపెడతారు.
దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే, అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు, అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం లాంటివి చేయవని, వీడియో కాల్ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.