Cyber Criminals Targeting on Woman For Crimes :ఒకప్పుడు ఓటీపీ వస్తే ఎవరికి పడితే వారికి షేర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రజలల్లో అవగాహన పెరిగి చిన్నవాటికే అప్రమత్తం అవుతున్నారు. తెలియని వాళ్లు ఫోన్ చేసి ఓటీపీలు, పాస్వర్డ్లు అడిగితే స్పందించడం లేదు. అలా ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ సైబర్ మాయగాళ్లు కొత్త పంథాలను కనిపెడుతున్నారు. భయబ్రాంతులకు గురిచేసో, డబ్బులు ఆశ చూపో డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా అమ్మాయిలే వలగా సైబర్ నేరగాళ్లు పన్నాగాలు పన్నుతున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఒక మోసంపై ప్రజలకు అవగాహన రాగానే కొత్త పంథాలను వెతుకుతున్నారు. డబ్బులను దోచుకుంటున్నారు. అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెర లేపారు. హత్యానేరాలు, మాదకద్రవ్యాలు, అక్రమ నగదు లావాదేవీలు, వ్యభిచార కార్యకలాపాల్లో పేర్లున్నాయంటూ బెదిరించి నగదు లాగేస్తున్నారు.
లబ్ధిదారుల జాబితా అంటూ ఏపీకే ఫైల్స్ వాట్సప్ చేస్తారు - క్లిక్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోండి
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినికి వాట్సాప్ నంబరు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. 'మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, ఆమె ఫోన్లో మీ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి' అంటూ బెదిరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ క్షణంలోనైనా మిమ్నల్ని అరెస్ట్ చేసే అవకాశముందని, తప్పు చేయలేదని నిరూపించేందుకు 24 గంటలు గడువిస్తున్నామని వివరించారు. అంతే భయపడిని బాధితురాలు ఈ విషయం తండ్రికి చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.