How To Keep Your House Safe From Thieves In Sankranti Holidays : సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యాలు సెలవులు ఇవ్వనున్నాయి. కొందరు ఇంటిల్లిపాదీ సొంత ఊళ్లకు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలో ఉండరు. ఇదే అదనుగా చేసుకొని దొంగలు నగదు, విలువైన వస్తువులకు పన్నాగాలు రచిస్తారని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. చోరీల నియంత్రణకు రాత్రి సమయాల్లో గస్తీ పెంచామని, ప్రజలు కూడా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు.
పలు సూచనలు : -
- సొంత ఊళ్లకు వెళ్లే వారు ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి.
- పోలీస్ అధికారులు మీ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారు.
- మీ ఇంటిని గమనించాలని నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి సూచనలు చేయాలి.
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. డీవీఆర్‌ను ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉంచాలి.
- ఊరు వెళ్తే వెండి, బంగారం, విలువైన వస్తువులు, డబ్బు ఇంట్లో ఉంచొద్దు. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమం.
- తాళం వేసిన తరువాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి. ఇంటిలోని ఓ గదిలో విద్యుత్తు దీపం వెలిగేలా చూడాలి.
- హోం సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ ఫోన్ నుంచి ఇంటి పరిసరాలను ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సొంత ఇంటికి అయితే కచ్చితంగా ఇనుప గ్రిల్ పెట్టుకోవడం మంచిది.
- ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లు ఏర్పాటు చేయండి. అలా చేస్తే రాత్రి సమయాల్లో పని చేస్తాయి. పరిసరాల్లో ఎటువంటి కదలిక వచ్చినా వెంటనే లైట్ వెలుగుతుంది.
- మీ ఇంటికి మోషన్ సెన్సార్, సెక్యూరిటీ అలారం లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్ వ్యవస్థ అమర్చుకోండి.
- వాహనాలను మీ ఇంటి దగ్గరలో పార్కింగ్ చేయాలి. బైక్ చక్రాలకు తాళం వేయాలి.
- విహార యాత్రలు, సొంతూరుకు వెళ్లే విషయం సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
- చోరీలకు ముందు దొంగలు కచ్చితంగా రెక్కీ చేస్తుంటారు. పగటి పూట వివిధ కారణాలు చెప్పి కాలనీల్లో తిరుగుతుంటారు.
- మీ కాలనీల్లో అనుమానంగా ఎవరైనా కనిపిస్తే, డయల్ 100 లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి.