Courier Frauds Raising in Telangana :సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. సాధారణ ప్రజలు పోలీసు కేసులు, అరెస్ట్ వారెంట్లు ఎదుర్కోవాలంటే సహజంగానే భయపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు కొరియర్ మోసాలకు పాల్పడుతున్నారు. కనీసం అవతలి వ్యక్తికి ఆలోచించే సమయం ఇవ్వకుండా తీవ్ర భయాందోళనలకు గురి చేసి డబ్బులు తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారు. విచిత్రంగా ఈ తరహా మోసాల్లో ధనికులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ఎక్కువగా బాధితులు అతున్నారు. మత్తుమందులు, ఆయుధాల కేసులు అనే సరికి కంగారు పడుతున్నారు. తాజాగా నల్లధనం పేరిట నేరగాళ్లు కొత్త దందాకు కూడా తెరలేపారు.
ఇదీ తీరు :
- ముందుగా దుండగుడు బాధితుల ప్రాథమిక వివరాలు సేకరించి వారికి ఫోన్ చేస్తాడు.
- పేరు పెట్టి పిలిచి, ఫలానా కొరియర్ ద్వారా మీరు విదేశాలకు పంపుతున్న పార్సిల్‌లో మత్తుమందులు, పాస్‌పోర్టులు, పిస్టల్, బుల్లెట్లు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని చెబుతాడు. సీబీఐ లేదా క్రైం బ్రాంచి పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
- కాసేపటికే మరో నంబరు నుంచి ఓ వీడియో కాల్ వస్తుంది. తాను ముంబయి సీబీఐ అధికారినని, కొరియర్‌లో నిషేధ వస్తువులపై కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో మీపై కేసు నమోదు చేశామని అంటాడు. విచారణకు ముంబయి రావాలని, లేకపోతే తామే వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తాడు. జైలుకు వెళ్లక తప్పదని, బెయిల్ కూడా రాదని హడలెత్తిస్తాడు.
- బాధితులు ఒకవేళ తాము ఏ కొరియర్ ఏదీ పంపలేదంటే, మీ పేరు, అడ్రస్ ఉన్నాయంటూ వివరాలు చదువుతాడు.
- దీంతో బాధితులు తమ పేరు మీద ఇంకెవరైనా పంపారేమోనని ఆలోచిస్తుండగానే మరో వీడియోకాల్ వస్తుంది. ఇంతలోనే తాము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నట్లు మళ్లీ అదే కథ చెబుతాడు.
- చివరకు బాధితులు తమను ఏదోవిధంగా ఈ కేసు నుంచి బయటపడేయమని ప్రాధేయపడే వరకు ఫోన్లు చేస్తూనే ఉంటారు.
- ఇక అప్పటి నుంచి బేరం మొదలుపెడతాడు. ఇది చాలా పెద్ద కేసు అని, కస్టమ్స్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి ఖర్చు కూడా భారీగానే ఉంటుందని అంటాడు.
- తర్వాత అవతలి వ్యక్తి మోసం గ్రహించే వరకు విడతల వారీగా ఇచ్చిన కాడికి డబ్బులు గుంజుతూనే ఉంటాడు. ఇటీవల ఇలా హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తున్న ప్రొఫెసర్ రూ.45 లక్షలు చెల్లించారు.
రూటు మార్చిన కేటుగాళ్లు : కొరియర్ మోసాలపై జనంలో కాస్త అవగాహన పెరగడంతో సైబర్ నేరస్థులు కొత్త తరహాలో దోపిడీ మొదలెట్టారు. ముందు ఫోన్ చేసి ‘మీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని, మీ ఖాతాలో నల్లధనం జమైనట్లు గుర్తించామని' కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు చెబుతాడు. ఇంకా బాగా నమ్మించేందుకు తాజాగా జరుగుతున్న ఏదైనా సంచలనాత్మక కేసును గురించి పేర్కొంటాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద అరెస్టైన ప్రముఖ వ్యక్తి పేరు చెప్పి, ఆయన ఖాతాల నుంచి మీ ఖాతాల్లోకి డబ్బు జమైందని అంటాడు. అసలు అతను ఎవరో తమకు తెలియదని బాధితులు చెప్పినా వినిపించుకోడు.